(Source: ECI/ABP News/ABP Majha)
Indian Army: ఆర్మీ నియామక ప్రక్రియలో మార్పులు, దరఖాస్తుకు 15 వరకు అవకాశం!
ఇండియన్ ఆర్మీలో నియామకాలకు సంబంధించి 2023-24 నుంచి పోస్టుల భర్తీ పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని ఆర్మీ అధికారులు నిర్ణయించారు. మార్చి 15 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది..
➥ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారికి 50 వరకు బోనస్ మార్కులు
➥ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ దాస్ వెల్లడి
ఇండియన్ ఆర్మీలో నియామకాలకు సంబంధించి 2023-24 నుంచి పోస్టుల భర్తీ పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. ఆటోమేషన్‌తో పారదర్శకత పెంచడంతోపాటు అభ్యర్థుల మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఫిట్‌నెస్ అంశాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్(జేసీవో), ఇతర ర్యాంకులతో(ఓఆర్)పాటు అగ్నివీరుల భర్తీ ప్రక్రియను ఇకపై నూతన పద్ధతిలో చేపడుతున్నట్లు రిక్రూటింగ్ డైరెక్టర్, కల్నల్ కీట్స్ కె.దాస్ వెల్లడించారు. తిరుమలగిరిలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయంలో ఫిబ్రవరి 28న విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు.
మూడు దశల్లో అగ్నివీరుల ఎంపిక ఉంటుందని ఆర్మీ నియామక అధికారి దాస్ వెల్లడించారు. మొదటి దశలో ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో అభ్యర్థుల శారీరక, వైద్య పరీక్షల అనంతరం రాత పరీక్షలను నిర్వహించి సైన్యంలోకి తీసుకునేవారమని ఇకపై ఇది మారుతుందని తెలిపారు. తొలుత ఆన్‌లైన్‌లో సాధారణ ప్రవేశ పరీక్షల (సీఈఈ)ను నిర్వహించి.. ఎంపికయ్యే అభ్యర్థులకు శారీరక, వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. అనంతరం ఆర్మీలో భర్తీ చేసుకోనున్నట్లు తెలిపారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో మార్చి 15 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని చెప్పారు.
ఐటీఐ/పాలిటెక్నిక్ అర్హత ఉంటే అదనపు మార్కులు..
సైన్యంలో సాంకేతిక విభాగాల్లో సిబ్బంది సంఖ్యను పెంచేందుకు అనువుగా ఇకపై ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన అభ్యర్థులకు నియామకంలో బోనస్‌గా 20 నుంచి 50 మార్కులను ఇవ్వాలని ఆర్మీ నిర్ణయించింది.
తెలంగాణలో 4 కేంద్రాల ఏర్పాటు..
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో ఆన్‌లైన్ పరీక్షలకు అవకాశం కల్పించామని రిక్రూటింగ్ డైరెక్టర్ దాస్ తెలిపారు. ఆన్‌లైన్ పరీక్ష ఫీజు రూ.500లు కాగా.. ఆర్మీ 50 శాతం భరిస్తుందని, మిగతాది అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి వెబ్‌సైట్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. 79961 57222 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
తెలంగాణ నుంచి 808 అగ్నివీరులు..
తొలివిడతలో తెలంగాణ నుంచి ఇద్దరు మహిళలు సహా మొత్తం 808 మంది అగ్నివీరులు ఎంపికయ్యారని కల్నల్ దాస్ తెలిపారు. వీరికి ఒకటి, రెండు రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.
Also Read: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!
ఏపీలో అగ్నివీర్ ఎంపికలకు దరఖాస్తుల ఆహ్వానం..
ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ పథకం ద్వారా 2023-2024 సంవత్సరంలో అగ్నివీర్ ఎంపికలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు తెలిపారు. ఆన్‌లైన్ ఎంపిక పరీక్షకు మార్చి 15 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని విశాఖలోని ఆర్మీ రిక్రూటింగ్ అధికారి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ పోస్టుకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతగలవారు అర్హులన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలి విడతగా ఏప్రిల్ 17 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్ ద్వారా పలు కేంద్రాల్లో కంప్యూటర్ రాతపరీక్ష నిర్వహిస్తారన్నారు. రెండో విడతగా ఎంపిక చేసిన అభ్యర్థులకు తెలియపరిచిన సమయం, తేదీల్లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే ప్రదేశాల్లో హాజరవ్వాల్సి ఉంటుందని జిల్లా యువజన సంక్షేమాధికారి తెలిపారు.