SGT Qualifications: కోర్టుకెక్కిన ఎస్‌జీటీ పోస్టులకు ‘బీఈడీ’ అర్హత వ్యవహారం, హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఎస్‌జీటీ, బీఈడీ అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న హైకోర్టులో పిటిషన్ దాఖలైంది..
AP DSC SGT Qualifications: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ డిగ్రీ అర్హత ఉన్నవారికి ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఫిబ్రవరి 15న హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్‌జీటీ, బీఈడీ అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనను రద్దు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలల్లో 4566 ఖాళీలు ఉన్నాయి. ఇక ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో 1534 ఖాళీలు ఉన్నాయి.
ఎస్జీటీ పోస్టులకు అర్హతలు ఇలా..
➥ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు రెండేళ్ల డీఎడ్/ డీఎల్‌ఈడీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
➙ ఓసీ అభ్యర్థులు 01.07.1980 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.
➙ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 01.07.1975 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.
➙ దివ్యాంగులు 01.07.1970 - 30.06.2024 మధ్య జన్మించి ఉండాలి.
రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్టీ)కు 80 మార్కులు, ఏపీటెట్‌కు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. అయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాత్రం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
ముఖ్యమైన తేదీలు..
విషయం | తేదీ |
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ | 12.02.2024. |
ఫీజుచెల్లింపు తేదీలు | 12.02.2024 - 21.02.2024. |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 22.02.2024. |
ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో | 24.02.2024. |
పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ | 05.03.2024 నుంచి. |
ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు | 15.03.2024 నుంచి 30.03.2024 వరకు. పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) |
ప్రిలిమినరీ ఆన్సర్ కీ వెల్లడి | 31.03.2024. |
ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ | 31.03.2024 నుంచి 03.04.2024 వరకు. |
ఫైనల్ కీ వెల్లడి | 08.04.2024 |
డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి | 15.04.2024 |
DSC 2024 School Education Notification