SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
APSLPRB: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు డిసెంబరు 6న విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారి వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు డిసెంబరు 6న విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(APSLPRB) అధికారి వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు మెయిన్ పరీక్ష తుది ఆన్సర్ కీని కూడా APSLPRB అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,288మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 28న ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 57,923మంది అభ్యర్థులు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. వారందరికీ దేహదారుఢ్య పరీక్ష పీఎంటీ/పీఈటీకు హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. అయితే, దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్షకు హాల్‌టికెట్లు ఇచ్చారు. తుది రాత పరీక్ష నాలుగు పేపర్లకు నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలు వెలువరించారు.
ఎస్‌ఐ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో పోలీసు ఎస్‌ఐ ఉద్యోగాల ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. దేహదారుఢ్య పరీక్ష(PMT)లో తమకు అన్యాయం జరిగిందని పిటిషన్ వేసిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు(AP High Court) షాకిచ్చింది. ఎత్తు విషయంలో పిటిషనర్లు అర్హులేనంటూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చాలంటూ గుంటూరు ఐజీని న్యాయస్థానం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో వైద్యులు ముగ్గురు అభ్యర్థుల ఎత్తును కొలవగా అనర్హులని తేలింది. దీంతో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా? లేక షరతు ప్రకారం రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లిస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సొమ్ము చెల్లించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.
19 మంది అభ్యర్థులు హాజరు..
హైకోర్టుకు డిసెంబరు 5న 19 మంది అభ్యర్థులు ఎత్తు కొలత కోసం హాజరయ్యారు. కోర్టు హాలులోనే ముగ్గురు అభ్యర్థుల ఎత్తు కొలిచారు. న్యాయమూర్తులిద్దరూ స్వయంగా దీనిని పరిశీలించారు. బోర్డు చెబుతున్న ఎత్తు, ప్రస్తుతం తీసిన ఎత్తు ఒకే విధంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా లేక కోర్టు షరతుకు కట్టుబడి రూ.లక్ష చొప్పున ఖర్చులు చెల్లిస్తారా? నేరుగా జైలుకు వెళతారా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ గతంలో అర్హత సాధించారన్నారు. తాజాగా ప్రభుత్వ వైద్యులు ధ్రువపత్రాలిచ్చారన్నారు. అందుకే ఎత్తు విషయంలో అర్హులనే విశ్వాసంతో ఉన్నామని నవ్వుతూ బదులిచ్చారు.
హైకోర్టు సీరియస్..
ధర్మాసనం స్పందిస్తూ.. ఇది నవ్వే వ్యవహారమా? ఎంత మంది సమయం వృథా చేశారో చూడండి అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ధ్రువపత్రాలిచ్చిన వైద్యుల వివరాలను సేకరించి విచారణ జరపాలని, ఆ పత్రాల వాస్తవికతను తేల్చాలని గుంటూరు ఐజీని ఆదేశించింది. హైకోర్టు అంటే జోక్ అనుకుంటున్నారా? హైకోర్టు విచారణ ప్రక్రియ అంటే నవ్వులాటగా ఉందా అని మండిపడింది. ఎంపిక ప్రక్రియను జాప్యం చేసినందుకు పిటిషనర్లు ఖర్చులు చెల్లించేందుకు అర్హులని పేర్కొంది. విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది. పోలీసు నియామక బోర్డు తరఫున ప్రభుత్వ న్యాయవాది కిశోర్ కుమార్ వాదనలు వినిపించారు.
పోస్టుల వివరాలు..
* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు
ఖాళీల సంఖ్య: 411
1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
జోన్ | జిల్లా/ఏరియా | పోస్టులు |
జోన్-1 (విశాఖపట్నం) | శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం | 50 |
జోన్-2 (ఏలూరు) | తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా | 105 |
జోన్-3 (గుంటూరు) | గుంటూరు, ప్రకాశం, నెల్లూరు | 55 |
జోన్-4 (కర్నూలు) | చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప | 105 |
మొత్తం | 315 |
2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
జిల్లా | ఖాళీల సంఖ్య |
ఎచ్చెర్ల- శ్రీకాకుళం | 24 |
రాజమహేంద్రవరం | 24 |
మద్దిపాడు - ప్రకాశం | 24 |
చిత్తూరు | 24 |
మొత్తం | 96 |