APPSC: వెబ్‌సైట్‌లో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ప్రాథమిక కీ, ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం
ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్-1, పేపర్-2 ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు.
APPSC Group1 Answer Key: ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్-1, పేపర్-2 ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్ ద్వారా మార్చి 19 నుంచి మార్చి 21 వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %) మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే మెయిన్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1లో 120 ప్రశ్నలు-120 మార్కులు, పేపర్-2లో 120 ప్రశ్నలు-120 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ); కాన్‌స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (;పార్ట్-బి), ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ & ప్లానింగ్ (పార్ట్-సి), జియోగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.