APPSC: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ - 2 ప్రిలిమ్స్ పరీక్ష, క్వశ్చన్ పేపర్ అందుబాటులో
APPSC Group 2: ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు.
APPSC Group 2 Prelims Exam: ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30. గంటలకు ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పరీక్ష నిర్వహణకు 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. పరీక్ష కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లను, 8500 ఇతర సిబ్బందిని నియమించింది.
విస్తృత బందోబస్తు..
పరీక్షల నిర్వహణ కోసం ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇందుకోసం 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు.. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్సియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుండి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారు. పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించినట్లు సీఎస్ తెలిపారు.
ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ఆఫ్‌లైన్ (OMR) విధానంలో ప్రిలిమినరీ (స్క్రీనింగ్) పరీక్ష నిర్వహించారు. పరీక్షలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు 150 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
గ్రూప్-2 ప్రశ్నపత్రం..
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి 23న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న నిర్వహించనున్న 'గ్రూపు-2' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను సిఎస్ ఆదేశించారు. అదే విధంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జవనరి 17తో గడువు ముగియనుంది. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.