BSF Constable Recruitment: BSF కానిస్టేబుల్ పోస్టుల్లో అగ్నివీరులకు రిజర్వేషన్.. హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ
Agniveers BSF Recruitment: అగ్నిపథ్ స్కీమ్ కింద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్ మెంట్ లో 50 శాతం పోస్టులకు అగ్నివీర్‌లకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

Agniveers in BSF Jobs | సరిహద్దు భద్రతా దళం (BSF) నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జనరల్ డ్యూటీ కేడర్‌కు సంబంధించిన నిబంధనలను సవరించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్, 1968 కింద లభించిన అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనలకు 'బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), జనరల్ డ్యూటీ కేడర్ (నాన్-గెజిటెడ్) రిక్రూట్‌మెంట్ (అమెండ్‌మెంట్) రూల్స్, 2025' అని పేరు పెట్టారు. డిసెంబర్ 18, 2025 నుండి ఇవి అమల్లోకి వచ్చాయి.
ఈ మార్పు వల్ల అగ్నిపథ్ పథకం (Agniveers) కింద సేవలు అందించిన యువతకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై BSFలో ప్రతి సంవత్సరం జరిగే నియామకాల్లో సగం (50 శాతం) ఖాళీలు మాజీ అగ్నివీరుల కోసం కేటాయించనున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన యువతకు భద్రతా దళాలలో శాశ్వత కెరీర్ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
The Central Government makes rules further to amend the Border Security Force, General Duty Cadre (Non-Gazetted) Recruitment Rules, 2015 by exercising the powers conferred by clauses (b) and (c) of sub-section (2) of section 141 of the Border Security Force Act,1968 (47 of 1968).…
— ANI (@ANI) December 21, 2025
మాజీ సైనికులకు నిర్దిష్ట వాటా రిజర్వ్
కొత్త నిబంధనల్లో మొత్తం ఖాళీలలో కొంత నిర్దిష్ట వాటా మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేసినట్లు హోం శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల సైన్యంలో గతంలో సేవలు అందించిన అనుభవజ్ఞులైన జవాన్లకకు ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాకుండా, కాంబాటైజ్డ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్‌లను కూడా నేరుగా నియామకం ద్వారా అడ్జస్ట్ చేయడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల వారి కెరీర్‌లో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం అగ్నిపథ్ పథకాన్ని బలోపేతం చేసే దిశలో ఒక పెద్ద ముందడుగుగా పరిగణిస్తోంది. ఇది అగ్నివీరుల భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితిని తగ్గించడమే కాకుండా, BSF వంటి కీలక భద్రతా సంస్థకు శిక్షణ పొందిన వారిని సైతం అందిస్తుంది.
నియామక ప్రక్రియలో పెరగనున్న పారదర్శకత
కొత్తగా సవరించిన నిబంధనల వల్ల నియామక ప్రక్రియలో పారదర్శకత, స్పష్టత పెరుగుతాయని దేశం కోసం సేవ చేయాలనుకున్న యువకులు ఆశిస్తున్నారు. ఇప్పుడు వివిధ వర్గాల అభ్యర్థులకు రిజర్వేషన్లు, అవకాశాలు స్పష్టంగా నిర్ణయించనున్నారు. దీనివల్ల బీఎస్ఎఫ్ నియామకాలకు సంబంధించిన గందరగోళం, వివాదాలు తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ మార్పు భద్రతా దళాలకు, యువతకు ఇద్దరికీ ప్రయోజనకరంగా మారనుంది.






















