సెల్‌ఫోన్‌లో ఆటలని చిన్నచూపు చూస్తున్నారా - రాటుదేలితే రూ.కోట్లు గెలుచుకోవచ్చు!
మనదేశంలో ఈస్పోర్ట్స్ మార్కెట్ మెల్లగా పెరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా వీటిని పైలట్ ఈవెంట్‌గా చేర్చారు.
సరదాగా వీడియో గేమ్ ఆడేవారు అదే గేమ్ లో ఇతర దేశాల క్రీడాకారులతో పోటీపడి సత్తా చూపించి మెడల్స్ గెలిస్తే.. అందులో ఓ కిక్కు ఉంటుంది. మొబైల్ లో టైమ్ పాస్ కోసం గేమ్స్ ఆడేవాళ్లు, అందులోనే జాతీయ క్రీడాకారుడిగా ఎదిగితే.. ఆ మజాయే వేరు. అవును ఇప్పుడు ఈ స్పోర్ట్స్ (ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్-Esports) ప్రపంచాన్ని శాశిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఇప్పుడిప్పుడే జోరు మరింత పెరుగుతోంది. ఈ స్పోర్ట్స్ లో కోచింగ్, మార్కెటింగ్, స్పోర్ట్స్ జర్నలిజం, గేమ్ డిజైనర్లు వంటి కొత్త తరం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
2000 సంవత్సరంలో సరదాగా కాలేజీ లెవల్లో, లేదా గల్లీ లెవల్లో ఇలాంటి ఈ స్పోర్ట్స్ మీట్ లు మొదలయ్యాయి. ఇప్పుడవి 60 లక్షలమంది క్రీడాకారులకు చేరువైంది. 250 కోట్ల రూపాయల పరిశ్రమగా మారింది. కామన్వెల్త్ ఈ స్పోర్ట్స్, ఆసియా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్.. మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒలింపిక్స్ లో కూడా ఈస్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆసియా క్రీడలతో పాటు, ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ లో పైలట్ ఈవెంట్ గా కూడా ఈస్పోర్ట్స్ ని చేర్చారు. DOTA 2, రాకెట్ లీగ్ లో భారత బృందం పోటీపడుతోంది. దీనికి ముందు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (IOC) గతంలో టోక్యో ఒలింపిక్స్ 2020కి ముందు వర్చువల్ ఒలింపిక్ సిరీస్ ని నిర్వహించింది. అయితే ఈసారి ఈ స్పోర్ట్స్ అధికారికంగా గుర్తింపు పొందిన క్రీడగా నిర్వహిస్తున్నారు. FIFA 22, స్ట్రీట్ ఫైటర్ V, హార్త్ స్టోన్, లీగ్ ఆఫ్ లెజెండ్స్, DOTA 2 అనే ఐదు విభిన్న గేమ్‌లలో భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 46 దేశాలు ఈ స్పోర్ట్స్‌ని సాధారణ క్రీడలుగా గుర్తించాయి.
పుష్కలంగా వ్యాపారం..
ఈ స్పోర్ట్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. వివిధ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ల ద్వారా ఆన్ లైన్ లో వివిధ టోర్నమెంట్ లు నిర్వహిస్తున్నారు. 152 దేశాలలో 500 మిలియన్లకు పైగా ఈ స్పోర్ట్స్ అభిమానులు వీటిని వీక్షిస్తున్నారు. భారత్ లో వీడియో గేమ్ స్ట్రీమింగ్ షోలో యూట్యూబ్, ఫేస్ బుక్, లోకో, రూటర్ వంటివి ముందున్నాయి. భారత్ లో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు వారంలో కనీసం 7 గంటలసేపు తమ ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడుతున్నారని అంచనా. చౌకగా ఉండటం, విస్తృతంగా అందుబాటులో ఉండటం, డేటా అందుబాటులోకి రావడంతో ఈ వీడియో గేమ్స్ ప్రజాదరణ చూరగొన్నాయి.
కోవిడ్ తర్వాత దేశంలోని ఈ స్పోర్ట్స్ అథ్లెట్లు, టీమ్‌ల సంఖ్య రెండింతలైంది. కొన్ని ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ లు రూ.2 కోట్ల వరకు భారీ బహుమతులను కూడా ప్రకటిస్తున్నాయి. 2025 నాటికి ఈ స్పోర్ట్స్ మార్కెట్ రూ.1100 కోట్లకు చేరుకుంటుందని అంచనా. వివిధ కంపెనీలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఈ స్పోర్స్ట్ స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ ర్యాపర్ రాఫ్తార్ దాని.. భాంగ్రా బూగీ కప్ కోసం ఫోర్ట్ నైట్ కంపెతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాడు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూటర్ కంపెనీతో కంటెంట్ క్రియేటర్‌గా సైన్ అప్ చేసాడు. హీరో టైగర్ ష్రాఫ్ ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
రమ్మీ, తీన్ పత్తి, పోకర్ వంటి గేమ్స్ కూడా ఈస్పోర్ట్స్ లో భాగమే. అయితే ఇందులో క్రీడాకారులు కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. అలా నష్టపోకుండా కేవలం తమ సమయాన్ని మాత్రమే వెచ్చించి ప్రైజ్ మనీ గెలుచుకునే క్రీడలు కూడా ఉన్నాయి. దీంతో ఈ స్పోర్ట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యధిక మార్కెట్ విలువతో ముందుకెళ్తుంది. కొత్త కొత్త ఉపాధి మార్గాలను కూడా సృష్టిస్తోంది.