CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
Andhra News: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ఎంపీలు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు.
![CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం cm chandrababu guided mps in tdp parliamentary meeting on railway projects and central funds CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/739fe51d81b00b155d4368bcca0346e91738118865994876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Chandrababu Meeting With MPs: రాజధాని అమరావతిని.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో కచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సూచించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం (TDP Parliamentary Meeting) నిర్వహించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా కృషి చేయాలన్నారు. 'గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అవుతుంది. అది కార్యరూపం దాలిస్తే రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోసం ఎంపీలు సమష్టిగా కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.12,150 కోట్లు ఇచ్చింది. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి దాని ఫలాలు రైతులకు అందిస్తాం. పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
'నియోజకవర్గాల్లో తిరగాలి'
రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానాలు, కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, విదేశాల్లో అమలవుతోన్న ప్రాజెక్టులు, విధానాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. జిల్లా ఇంఛార్జీ మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఎస్పీలు ఓ బృందంగా ఏర్పడి సమన్వయంతో పని చేయాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి హాజరు ఉండాలని.. మిగతా సమయాల్లో ఎంపీలు వారి నియోజకవర్గం మొత్తం తిరగాలని సూచించారు. 'ఎంపీలు.. ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేయాలి. ఉపాధి హామీ వంటి పథకాలకు అనుమతులిచ్చేటప్పుడు తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించండి.' అని సీఎం పేర్కొన్నారు.
ఎంపీలకు ప్రశంసలు
ప్రస్తుత ఎంపీల్లో కొత్తవారున్నా.. అందరూ సమన్వయంతో, ఓ బృందంలా పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇకపైనా అదే స్ఫూర్తితో కొనసాగాలని సూచించారు. 'కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా ఉదారంగా సాయం అందిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా టీడీపీ కూడా అదే తరహా సహకారం అందించాలి. దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికి పూర్తి అండగా నిలవాలి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలి. రాష్ట్రానికి కొత్త రహదారులు కేటాయించేలా, విస్తరణ ప్రాజెక్టులకు అనుమతులిచ్చేలా ఎంపీలు చొరవ తీసుకోవాలి.' అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అటు, రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా, కొత్త ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్, రేణిగుంట - గూడూరు, కోటిపల్లి - నరసాపురం, కడప - బెంగుళూరు తదితర ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి బడ్జెట్‌లో అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలన్నారు. సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేటప్పుడు జీఎస్టీ లేకుండా చూడాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)