Ovarian Cyst: మహిళల్లో పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కువ శాతం కారణం ఇదే
చాలామంది మహిళల్లో సంతానం కలగడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఒవేరియన్ సిస్ట్‌లు.
పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు వారి కోరికకు అడ్డుపడుతున్నాయి. ఎక్కువ మంది మహిళల్లో పిల్లలు కలగకుండా చేస్తున్న సమస్య ఒవేరియన్ సిస్టులు. వీటినే తెలుగులో అండాశయ తిత్తి అంటారు. ఇవి చిన్న సంచులు మాదిరిగా స్త్రీ అండాశయంలో తయారవుతాయి. వీటిలో ద్రవపదార్థం నిండిపోతుంది. ఈ తిత్తుల వలన సంతానం కలగకుండా ఇబ్బంది ఎదురవుతుంది. చాలా అండాశయ తిత్తులు సహజంగా ఏర్పడి, ఎటువంటి చికిత్స లేకుండా కొన్ని నెలల్లో మాయం అవుతాయి. కొన్ని మాత్రం తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. అండాశయ తిత్తి చీలినప్పుడు బాధలు ఎక్కువ అవుతాయి. అంతర్గత రక్తస్రావం అవుతుంది. అవి కలిగించే తీవ్రమైన సమస్యల్లో ముఖ్యమైనది సంతానం కాకుండా అడ్డుపడడం. వాటి పరిమాణాన్ని బట్టి లక్షణాలు ఆధారపడతాయి.
లక్షణాలు
తిత్తులు పెద్దగా ఉంటే పొత్తు కడుపు భాగం కింద నొప్పి అధికంగా ఉంటుంది. వికారం, వాంతులు వస్తాయి. చాలా నిరాశగా ఉంటుంది. రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉంది. సెక్స్ సమయంలో విపరీతమైన బాధ కలుగుతుంది.వీటి వల్ల స్త్రీలలో హార్మోన్ల సమస్యలు, పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పెల్విక్ ఇన్ఫెక్షన్లు, గర్భం ధరించకపోవడం వంటివి కూడా ఉంటాయి. ఒకసారి అండాసాయ తిత్తులు వచ్చి తగ్గాక మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువే.
పిల్లలు కలగకుండా ఉండడం, కడుపునొప్పి అధికంగా రావడం, కడుపు ఉబ్బరం, రుతుక్రమ సమయంలో విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, రుతుక్రమం సమయానికి కాకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. సిస్టులకు సరైన సమయంలో చికిత్స అందించకపోతే అండాశయాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. దీనివల్ల పూర్తిగా బిడ్డలను కనే అవకాశాన్ని కోల్పోతారు.
సోనోగ్రఫీ పద్ధతిలో పొట్టలో తిత్తులు ఉన్నాయో లేవో డాక్టర్లు గుర్తిస్తారు. అల్ట్రాసౌండ్ సహాయంతో కూడా వీటిని గుర్తించవచ్చు. అండాశయ తిత్తుల పరిమాణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. వాటి పరిమాణం తక్కువగా ఉంటే హార్మోన్ల చికిత్స చేస్తారు లేదా శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగిస్తారు.
కొన్ని సందర్భాల్లో, అండాశయ తిత్తులు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తక్కువ అంచనా వేయకూడదు. కొన్ని వాటంతట అవే మాయమవుతాయి. కొన్ని మాత్రం చాలా అరుదుగా క్యాన్సర్ గా మారి ప్రాణాలను మీదకు తెస్తాయి. కాబట్టి సమస్య చిన్నదైనా కూడా వెంటనే స్పందించడం మంచిది. కేవలం మందుల ద్వారానే వీటిని మొదటి దశలో కరిగించుకోవచ్చు.
Also read: టీ లేదా కాఫీ తాగుతూ తినకూడని ఆహారాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.