PCOS: పిసిఓఎస్ సమస్య ఉంటే మీ ముఖంలో కనిపించే లక్షణాలు ఇవే
స్త్రీలను తల్లితనానికి దూరం చేసే సమస్యల్లో ఒకటి... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.
ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు అమ్మతనానికి దూరం కావడానికి ఒక కారణం పిసిఒఎస్. అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 116 మిలియన్ల మంది మహిళలు దీనిని బారిన పడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇది మహిళల అండాశయాలను ప్రభావితం చేసే ఒక హార్మోన్ల పరిస్థితి. యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం ఇవి వచ్చినప్పుడు శరీరంలో మూడు మార్పులు జరుగుతాయి.
1. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం
2. ఆండ్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం
3. అండాశయాల్లోల తిత్తులు ఏర్పడడం
పీసీఓఎస్ వచ్చాక పరిస్థితి ముదిరే దాకా చాలామంది మహిళలు ఈ వ్యాధి బయటపడదు. ఈ సమస్యతో బాధపడే మహిళల ముఖంపై కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే ముందే తేరుకుని చికిత్స తీసుకోవచ్చు.
ముఖంలో కనిపించే మార్పులు
పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళల ముఖంపై కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక స్థాయిలో ఆండ్రోజన్లు లేదా మగ హార్మోన్లు ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ముఖంపై అధికంగా మొటిమలు వస్తాయి. ముఖం పై అధిక మొత్తంలో సెబమ్ ఉత్పత్తి అయి, జిడ్డు కారుతున్నట్టు అవుతుంది. దవడ, గడ్డం, మెడ భాగంలో కూడా మొటిమలు వస్తాయి. ఇలా వస్తున్నాయంటే అది పిసిఒఎస్ సమస్యకి సంకేతమని భావించవచ్చు.
ఇతర సంకేతాలు
1. పీరియడ్స్ పూర్తిగా రావడం ఆగిపోతాయి లేదా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తాయి.
2. గర్భం పొందడంలో ఇబ్బంది కలుగుతుంది.
3. జుట్టు అధికంగా పెరుగుతుంది. ముఖం, ఛాతీ, వీపు పై ఎక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి.
4. కొందరిలో జుట్టు అధికంగా రాలిపోతుంది కూడా.
మహిళల్లో పిల్లలు పుట్టక పోవడానికి పిసిఒఎస్ అనేది అత్యంత సాధారణ కారణాల్లో ఒకటిగా మారింది. అండోత్సరగ్ము జరగకుండా పిసిఒఎస్ అడ్డుపడుతుంది. అండోత్సర్గము అంటే అండాశయాల నుండి గర్భాశయంలోకి అండాలు విడుదలయ్యే ప్రక్రియ. ఆ అండాలు ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా కిందకి జారుతాయి. అలా అక్కడ ఆ అండాలు 12 నుంచి 24 గంటల వరకు ఉంటాయి. ఆ సమయంలోనే వీర్యకణాలు అక్కడికి చేరితే ఫలదీకరణం జరుగుతుంది. కానీ పిసిఒఎస్ ఉన్న స్త్రీలలో అండోత్సర్గము సరిగా జరగదు. ఒక్కోసారి జరిగిన కూడా సరియైన కాలవ్యవధిలో జరగక, గర్భం పొందడం కష్టం అయిపోతుంది.
ఇది ఎందుకు వస్తుంది?
పిసిఓఎస్ ఎందుకు వస్తుంది? అనేదానికి కారణం స్పష్టంగా చెప్పలేము. ఇన్సులిన్ నిరోధకత అధికంగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారసత్వంగా కూడా ఇది వస్తుంది. పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా పిసిఒఎస్ వచ్చే అవకాశం ఎక్కువ.
Also read: నిశ్శబ్ద గుండెపోటు -డయాబెటిస్, హైబీపీ లేకుండానే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.