New Covid 19 Variant: బీ అలర్ట్.. మరో కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఒమిక్రాన్ కన్నా అంతకుమించి!
కరోనాలో మరో కొత్త వేరియంట్ వచ్చేసింది. ఇప్పటికే ఒమిక్రాన్‌తో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే తాజాగా మరో వేరియంట్ వెలుగుచూసింది.
ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కేసులు ప్రపంచంపై దండయాత్ర చేస్తుంటే తాజాగా మరొక కొత్త వేరియంట్ బయటపడింది. అవును.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఇది సోకుతున్నట్లు తేలింది. ఈ కొత్త మ్యుటేషన్ పేరు ఐహెచ్‌యూ (బీ.1.640.2). ఫ్రాన్స్‌లోని ఐహెచ్‌యూ మెడిటరనీ ఇన్‌ఫెకన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త మ్యుటేషన్‌ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్‌కు పెట్టారు.
అంతకుమించి..
ఒమిక్రాన్ కన్నా ఐహెచ్‌యూకు మ్యూటేషన్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని మార్సెయ్ అనే సిటీలో 12 కేసులను నిర్ధారించారు. వీరంతా ఆఫ్రికా కామెరూన్ నుంచి వచ్చినట్లు తేలింది.
ఈ వేరియంట్ లో 46 మ్యుటేషన్లు ఉన్నట్లు.. దీంతో ఒమిక్రాన్ కన్నా వేగంగా ఇది సోకుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్లకు కూడా అది లొంగడం లేదని అంటున్నారు. కొత్త వేరియంట్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ వేరే దేశాల్లో లేదని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. దీనిని 'వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్' జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది.
ఒమిక్రాన్ దడ..
ఇప్పటికే ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.
దేశంలో ఒమిక్రాన్, కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు పెరిగింది. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది వైరస్‌తో మృతి చెందారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా ఒమిక్రాన్ కేసులే ఉండడం.. మూడోదశకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగనిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా గ్రూప్ (ఎన్టీఏజీఐ) ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎన్కే ఆరోరా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతున్న కేసులు థర్డ్‌వేవ్‌కు సంకేతమని తెలిపారు. అయితే భయపడాల్సిన పని లేదన్నారు.
ఎందుకంటే ఒమిక్రాన్ సోకినవారు ఆసుపత్రిలో చేరిన శాతం చాలా తక్కువని ఆయన అన్నారు. ఒమిక్రాన్ లక్షణాలు కూడా చాల తక్కువని ఆయన అన్నారు.