Male menopause: మహిళల్లోనే కాదు పురుషుల్లోనూ మెనోపాజ్? ఆ సామర్థ్యం తగ్గిపోతుందా? డాక్టర్స్ ఏం చెప్పారంటే!
Male menopause: మెనోపాస్ స్త్రీలలోనే కాదు పురుషుల్లో కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తల ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చని తెలుపుతున్నారు.
సాధారణంగా మెనోపాజ్ దశ మహిళల్లోనే కనిపిస్తూ ఉంటుంది. మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. అండం విడుదల ఆగిపోవడాన్ని మెనోపాజ్ దశగా గమనించవచ్చు. అయితే ఈ దశకు చేరుకునే సమయంలో మహిళల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా పలు మార్పులు కలుగుతాయి. మెనోపాజ్ దశ ఉన్న మహిళల్లో సాధారణంగా హార్మోనల్ మార్పుల వల్ల వారి మానసిక పరిస్థితిలో కూడా చాలా ఒత్తిడి కనిపిస్తుంది.
అయితే ఈ మెనోపాజ్ దశ అనేది కేవలం మహిళలకు మాత్రమే కాదు పురుషుల్లో కూడా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్త్రీలలో కనిపించే మెనోపాజ్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని మేల్ మెనోపాజ్ అని కూడా అంటారు. ఈ దశ సాధారణంగా 50 సంవత్సరాలు దాటిన పురుషుల్లో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మేల్ మెనోపాజ్ దశ స్త్రీల మెనోపాజ్‌తో పోల్చి చూసినట్లయితే కాస్త భిన్నంగా ఉంటుంది.
ఆ కోరికలు తగ్గిపోతాయట
పురుషుల్లో సంభవించే ఈ మెనోపాజ్ వల్ల వారిలో లైంగిక ఆసక్తి అనేది తగ్గిపోతుంది. అలాగే వీరిలో శక్తి కూడా తగ్గుతుంది. వీరిలో డిప్రెషన్ కూడా పెరుగుతుంది. ఫలితంగా మూడ్ చేంజెస్‌తో పాటు చేసే పని పట్ల నిరాసక్తి కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఎముకల్లో డెన్సిటీ తగ్గుతుంది. వీరిలో ఆస్టియోపోరోసిస్ అనే జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మతిమరుపు వంటి సమస్యలు కూడా వస్తాయి. శరీర బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
కారణాలేమిటీ?
వయస్సు పెరిగేకొద్ది పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. ఫలితంగా ఈ మేల్ మెనోపాజ్ సంభవిస్తుంది. ఈ దశ తరువాత పురుషుల్లో వృద్ధాప్యం కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చెడు అలవాట్ల వల్ల బీపీ, డయాబెటిస్ వంటి జబ్బులు వస్తాయని.. అవి మేల్ మెనోపాజ్ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు పురుషుల్లో ఎక్కువగా ఎవరైతే శారీరక శ్రమకు దూరంగా ఉంటారో వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ మేల్ మెనోపాజ్ దశ నుంచి దూరంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోవడం ముఖ్యమైనదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని, కార్బోహైడ్రేట్లు తగ్గించి ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. టెస్టోస్టిరాన్ నిలువలు తగ్గకుండా ఉండాలంటే సరైన నిద్ర, వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.
Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగితే అంత ప్రమాదమా? తల్లీబిడ్డలకు వచ్చే సమస్యలివే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.