Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా
కాలేయానికి వచ్చే వ్యాధుల్లో ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’ కూడా ఒకటి. ఇది కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది.
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ అధికంగా తాగే వారిలో ఈ వ్యాధి వస్తే దాన్ని ‘ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ అని పిలుస్తారు. ఆల్కహాల్ తాగని వారిలో అధిక బరువు కారణంగా ఈ వ్యాధి వస్తే ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ అంటారు. కాలేయంలో అధిక కొవ్వు స్థాయిల వల్ల కాలేయం ఈ వ్యాధి బారిన పడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో కూడా కాలేయంలో అధిక కొవ్వు స్థాయిలు ఉండే అవకాశం ఉంది. ఇలా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాలపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య సాయం తీసుకోవడం అత్యవసరం. లేకుంటే అది ప్రాణాంతకంగా మారిపోతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
కడుపు నొప్పి
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు పొత్తికడుపు నొప్పి వస్తుంది. ఈ నొప్పి పొట్టకు కుడివైపున ఎగువ భాగంలో ఎక్కువగా అనిపిస్తుంది. అక్కడ ఏదో అడ్డంకిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ నొప్పి కుడి భాగం నుంచి మొత్తం పొత్తికడుపు అంతా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది రోగుల్లో పొత్తికడుపు భాగంలో వాపు కూడా కనిపిస్తుంది.
వికారం
వికారంగా అనిపించడం, వాంతులు అవ్వడం, అనారోగ్యంగా కనిపించడం ఇవన్నీ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు. పొట్టనొప్పి కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టు ఆ రోగి కనిపిస్తాడు. కొన్ని సమయాల్లో ఆకలి వేయదు. చాలా నీరసంగా అలసటగా అనిపిస్తుంది. వికారంగా అనిపిస్తుంది.
ఆకలి లేకపోవడం
తిన్నా, తినకపోయినా ఆకలి అనే భావన చాలా మేరకు తగ్గిపోతుంది. దీనివల్ల ఆ రోగి బలహీనంగా మారిపోతాడు. బరువు తీవ్రంగా తగ్గిపోతాడు. బరువు ఇలా ఆకస్మికంగా తగ్గుతున్నా, ఆకలి వేయకపోయినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్‌లు ఒక సాధారణ లక్షణం.
పైన చెప్పిన లక్షణాలు కాకుండా ఇతర సంకేతాలు కూడా ఉన్నాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడిన రోగి మెరుగ్గా ఆలోచించలేడు, గందరగోళంగా అనిపిస్తుంది. గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం ఆగదు. చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఎవరైనా ఊబకాయం, టైప్ 2 మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతాయి. అలాగే 50 ఏళ్లు దాటిన వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
Also read: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.