Gastrocolic Reflex: తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తున్నారా? ఇది ఆరోగ్యసమస్యేనా?
కొందరు లంచ్ చేసిన వెంటనే బాత్రూమ్ వైపు పరుగెడతారు. ఇది ఎంతవరకు ఆరోగ్యకరం.
కొన్నిసార్లు ఆహారం తిన్న వెంటనే మలవిసర్జన వస్తుంది. అది సమస్యగా కూడా చాలా మంది భావించారు. అతి పెద్ద సమస్య కాకపోయినా, ఆరోగ్య సమస్య కిందకే వస్తుంది. రోజూ అలా చేయాల్సి వస్తే మాత్రం దాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ సమస్యను గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. మనం తినే ఆహారం మీ శరీరం నుంచి మలం రూపంలో బయటికి వెళ్లడానికి సాధారణంగా రెండు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది. అలా కాకుండా తిన్న వెంటనే మల విసర్జనకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో కచ్చితంగా తెలుసుకోవాలి.
గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఒక శారీరక ప్రతిస్పందన. అంటే ఆహారం తిన్నాక అది లోపలికి వెళ్లి జీర్ణశయాంతర ప్రేగులలో కదలికను ప్రేరేపిస్తుంది. ఇర్రెటబుల్ బోవెల్ సిండ్రోమ్ బాధపడుతున్న వ్యక్తులలో ఎక్కువగా ఈ కదలికలు అధికంగా ఉండి మలవిసర్జన వెంటనే అవుతుంది. ఆహారం పొట్టలోకి ప్రవేశించినప్పుడు,పెద్దప్రేగు సంకోచానికి కారణమయ్యే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీని వల్ల పేగు సంకోచించి గతంలో తిన్న ఆహారాన్ని మరింత ముందుకు తోస్తుంది. దీని ఫలితంగా మలాన్ని విసర్జించాలనే కోరిక ఏర్పడుతుంది.
కొంతమందిలో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తేలికపాటిదిగా ఉంటుంది. ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొందరిలో మాత్రం గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తీవ్రంగా ఉంటుంది. కొన్ని ఆహారాలు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్‌ను పెంచుతాయి.
1. తృణధాన్యాలు, అధిక ఫైబర్ ఆహారాలు ఉన్న ఆహారాలు
2. పాలు
3. వేపుళ్లు
4. ప్రాసెస్ చేసిన ఆహారం
5. జంక్, స్పైసీ ఫుడ్
ఈ అనారోగ్యాలు...
శరీరంలో ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో కూడా గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అధికంగా ఉంటుంది.
1. ఒత్తిడి మరియు ఆందోళన
2. ఉదరకుహర వ్యాధి
3. ఆహార అలెర్జీలు
4. గ్యాస్ట్రోఎంటెరిటిస్
5. కడుపు నొప్పి
6. ఉబ్బరం
7. గ్యాస్ సమస్యలు
8. అతిసారం
గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ రాకుండా ఉండాలంటే అనారోగ్యకరమైన కొవ్వులు నిండిన ఆహారాన్ని తినడం మానేయాలి. భోజనం అధికంగా ఒకేసారి తినకుండా, కొంచెం కొంచెంగా తినాలి. గ్యాస్ ను విడుదల చేసే ఆహారాలు తినకూడదు. భోజనం తినే ముందు పిప్పరమింట్ టీని తాగండి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
Also read: టమోటో కెచప్ ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.