Beer: బీరు తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయా? ఇది ఎంతవరకు నిజం
చాలామందిలో ఉన్న అభిప్రాయం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించాలంటే బీరు తాగాలి అని. కానీ అది ఎంతవరకు నిజమో ఎప్పుడైనా ఆలోచించారా?
మూత్రపిండాల్లో రాళ్లు చేరడం అనేది ఎక్కువ మందిని ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది నొప్పిని కలిగించడమే కాదు, మూత్రాన్ని అడ్డుకోవడంతో పాటు, కిడ్నీ వాపుకు కారణం అవుతుంది. మూత్రపిండాల్లో ఖనిజాలు, లవణాలు కలిసి గట్టి నిక్షేపాలుగా మారుతాయి. అవే మూత్రపిండాల్లో రాళ్లు.
ఒక సర్వే ప్రకారం బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చని మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్టు తెలిసింది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది ఒక అపోహ మాత్రమే. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారిలో 50 శాతం మంది బీరు తాగడం ద్వారా రాళ్ళను కరిగించుకోవాలని అనుకున్నట్టు ఈ సర్వే చెప్పింది. అయితే బీరు వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయన్నది దానిపై ఎలాంటి శాస్త్రీయ నిరూపణ జరగలేదు. బీర్ తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతుంది. చిన్నచిన్న రాళ్లు ఉంటే ఆ మూత్రం నుంచే బయటికి పోతాయి. కానీ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లను శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జించడం చాలా కష్టం. మూడు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న రాళ్లు మాత్రమే మూత్రం ద్వారా బయటికి పోతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం వల్ల కలిగే నొప్పి బీర్ తాగడం వల్ల మరింత ఎక్కువవుతుందని చెబుతున్నారు వైద్యులు. బీరు తాగితే మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రాళ్ల సమస్య వల్ల ఆ మూత్రం బయటికి పోలేక, నొప్పి మొదలై బాధాకరంగా మారుతుంది.
పెరుగుతున్న కేసులు
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం అనే సమస్య 2022లో 180 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అత్యంత సాధారణ ప్రమాద కారకాలు మధుమేహం, అధిక రక్తపోటు అని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. అలాగే ఊబకాయం, అధిక బరువు కొన్ని రకాల సప్లిమెంట్లు, మందుల వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య పెరుగుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే అవి మీ మూత్ర నాళంలో ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేయొచ్చు.
వైద్యులు చెబుతున్న ప్రకారం మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి లిథోట్రిప్సి అనే పద్ధతిని వినియోగిస్తారు. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను విచ్చిన్నం చేయడానికి ధ్వని తరంగాలను ఉపయోగించే నాన్ ఇన్వాసివ్ ప్రక్రియ. ఈ ప్రక్రియ కోసం ఒకటి లేదా రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. అధిక ఆక్సిలేట్లు ఉండే ఆహారాలైన బీట్‌రూట్, పాలకూర, బాదం వంటివి తినకూడదు. సోడియం అంటే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. సోడియం అధికంగా తినడం వల్ల మూత్రంలో క్యాల్షియం స్థాయిలో పెరుగుతాయి. తద్వారా రాళ్లు ఏర్పడే సమస్య పెరుగుతుంది.
Also read: శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.