Junk Food: జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? అయితే ఆ కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ
యువతలో జంక్ ఫుడ్ తినే అలవాటు అధికం. కానీ అతిగా తింటే తీవ్రమైన కాలేయవ్యాధి వచ్చే అవకాశం ఉంది.
పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, కూల్ డ్రింకులు, నూడుల్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కోవలోకె వస్తాయి. వీటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. అందుకే వీటికి ఎవరైనా బానిసలుగా మారడం చాలా సులువు. ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఇంత వేగంగా ఎదగడానికి కూడా కారణం వాటి రుచికి ఎక్కువ మంది దాసోహం అవ్వడమే. పిల్లలు, యువత అధికంగా ఈ జంక్ ఫుడ్ తినేందుకు ఇష్టం చూపిస్తున్నారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జంక్ ఫుడ్ అధికంగా తింటున్నవారిలో ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి’ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
క్లినికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హెపటాలజీ జర్నల్లో ఇటీవల ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. అందులో జంక్ ఫుడ్ వినియోగం కూడా ఫ్యాటీ లివర్ సమస్యకు కారణం అవుతుందని తెలిపింది. ఫాస్ట్ ఫుడ్ ద్వారా రోజువారి మనకు కావాల్సిన క్యాలరీలలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్న వారి శరీరంలో స్టీటోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 4000 మంది పెద్దలను ఎంపిక చేసుకున్నారు.వీరిలో జంక్ ఫుడ్ తినని వారు, తినే వారు.. ఇలా రెండు కేటగిరీలను తీసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ తినని వారితో పోలిస్,తే తినే వారిలో కాలేయంలో కొవ్వు స్థాయిలు అధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఇలా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ వచ్చే అవకాశం తీవ్రంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని వివరిస్తున్నారు.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మన శరీరంలో ప్రధాన అవయవాలు సరిగా పనిచేయాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండడం అవసరం. ఆరోగ్యకరమైన కాలేయం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను సర్దుబాటు చేస్తుంది. అలాగే ప్రోటీన్లను నిర్మిస్తుంది. పిత్తాన్ని తయారు చేస్తుంది. ఈ పిత్తమే కొవ్వులను గ్రహించడంలో సహాయపడుతుంది. మీకు అవసరమైనప్పుడు చక్కెరను నిలువ చేస్తుంది. హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుంది. అదే కాలేయంలో చెడు కొవ్వులు పేరుకుపోయి సరిగా పనిచేయకపోతే శరీర ఆరోగ్యమే మూలన పడుతుంది.
కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ వీటన్నింటికీ దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ప్రోటీన్ ఉన్న ఆహారాలు, పాల ఉత్పత్తులు, మంచి కొవ్వు ఉండే పదార్థాలు అధికంగా తీసుకోవాలి. అలాగే కాలేయం చక్కగా పనిచేయాలంటే ఫైబర్ అవసరం. కాబట్టి ఫైబర్ ఉండే ఆహారాన్ని ప్రత్యేకంగా తినాలి. అన్నింటికంటే ముఖ్యం శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా పుష్కలంగా నీళ్లు తాగాలి.
Also read: టమోటో కెచప్ తెలుసు, మరి బనానా కెచప్ తెలుసా? ఇది కూడా అదిరిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.