పొట్టకు కుడివైపున వచ్చే నొప్పిని తేలిగ్గా తీసుకోకండి - ఇవి భయంకర రోగాలకు సంకేతం కావచ్చు
పొట్ట నొప్పిని తేలికగా తీసుకుంటే చాలా సమస్యలు ముదిరిపోయే అవకాశం ఉంది.
కొందరికి కడుపు నొప్పి వచ్చి పోతుంటుంది. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అయితే పొట్టకి కుడివైపు మూలలో వచ్చే నొప్పి చాలా భయంకరమైన రోగాలకు లక్షణంగా చెప్పుకోవచ్చు. అది చిన్న నొప్పి అయినా తేలికగా తీసుకోవద్దు. ఒకసారి వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే పొట్టకు కుడి వైపునే పేగులు, కాలేయం వంటి జీర్ణక్రియలో పాల్గొనే ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. అటువైపు నొప్పి రావడం అనేది ఆ అవయవాలకు సంబంధించింది అయి ఉండవచ్చు. పొత్తికడుపు భాగంలోనే పెద్ద పేగులు, స్త్రీలలో కుడి అండాశయం కూడా ఉంటాయి. వాటికి ఇన్ఫెక్షన్లు వచ్చినా, ఏమైనా సమస్యలు వచ్చినా కూడా నొప్పి ద్వారానే ఆ విషయాన్ని బయటికి చెబుతాయి. కుడివైపున నొప్పి వచ్చినప్పుడు ఈ వ్యాధులు ఉండే అవకాశం ఉంది...
అపెండిసైటిస్
పొత్తికడుపు కుడి భాగంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి సన్నగా వచ్చి పెరుగుతూ వస్తోందంటే... అది అపెండిసైటిస్ వల్ల కావచ్చు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం అపెండిక్స్ పెద్ద పేగులకు అనుసంధానించిన ఒక ట్యూబు లాంటి నిర్మాణం. ఇది జ్వరం, విరేచనాలు, వాంతులు, బలహీనంగా మారడం మొదలైన వాటికి ఎక్కువగా కారణం అవుతుంది. ఆ ప్రాంతంలో ఎక్కువ నొప్పి వస్తుందంటే దాన్నుంచి ఉపశమనం పొందడానికి అపెండిక్స్ ను తొలగించాల్సి ఉంటుంది. దీన్ని తొలగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి చేటు ఉండదు.
మూత్రపిండాల్లో రాళ్లు
ఈ సమస్యను నెఫ్రోలితియాసిస్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు పిల్లలు, పెద్దలు తేడా లేకుండా మూత్రపిండాల్లో రాళ్లు చేరుతున్నాయి. కాల్షియం పేరుకుపోయి ఈ రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు చిన్న సైజులో ఉంటే మూత్ర వ్యవస్థ ద్వారా సులభంగా బయటికి వచ్చేస్తాయి. కానీ పెద్ద రాళ్లు మాత్రం ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ నొప్పి వీపుకి దిగువున, పొత్తి కడుపుకి పక్కన గజ్జల చుట్టూ కలుగుతుంది. కాబట్టి నొప్పి అధికంగా కలిగితే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కూడా అని అనుమానించవచ్చు.
ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్
ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక అనారోగ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్స్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ సంస్థ చెప్పిన ప్రకారం ఇది అమెరికా జనాభాలోని 12 శాతం మందిని ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, పేగు కదలికల్లో ఇబ్బంది, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు కలుగుతాయి.
నెలసరి నొప్పి
ఇది కేవలం ఆడవాళ్ళల్లో కలిగే నొప్పి. పీరియడ్ పెయిన్స్ అని పిలుస్తారు. కొంతమంది ఆడవాళ్లకు రుతుక్రమం సమయంలో ఈ నెలసరి నొప్పి విపరీతంగా వస్తుంది. బాధతో విలవిలలాడిపోతారు. ఇది ఎందుకు వస్తుందంటే మీ గర్భాశయం పైన పొర ఊడి బయటకు పోయేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే ఈ నొప్పి కలుగుతుంది. కొంతమందిలో ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పితో పాటు వికారం, వాంతులు, విరోచనాలు, తలనొప్పి కూడా కలుగుతాయి
క్యాన్సర్
పొత్తికడుపు నొప్పిగా అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం, పొట్టలో క్యాన్సర్ లక్షణం అని చెప్పుకోవచ్చు. వైద్యుల ప్రకారం పొత్తికడుపులో వాపు లేదా ద్రవం పేరుకుపోవడం వల్ల పొట్ట క్యాన్సర్ వస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెప్పిన ప్రకారం నొప్పితో పాటు అజీర్ణం, గుండెల్లో మంట వస్తుందంటే పొట్ట క్యాన్సర్ ప్రారంభ దశలో ఉందని అర్థం. కాబట్టి పొట్టలో కుడివైపున నొప్పి వస్తే దాన్ని తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Also read: మొండి కరోనా వైరస్ మెదడులో 8 నెలలు ఉండే అవకాశం - కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.