(Source: Poll of Polls)
మొండి కరోనా వైరస్ మెదడులో 8 నెలలు ఉండే అవకాశం - కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం ఇంతా అంతా కాదు. ప్రపంచాన్ని స్తంభింప పోయేలా చేసింది.
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రపంచంలో మళ్ళీ వ్యాపించడం మొదలుపెట్టింది. చైనాలో ఇప్పటికే కొత్త ఒమిక్రాన్ BF.7 వేరియంట్ వల్ల మరణాలు సంభవించడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ అక్కడ ఎన్నో ఆంక్షలు, లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన BF.7 వేరియంట్ ఇతర దేశాలకు పాకుతూ భయాందోళన కలిగిస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారిపై మనదేశంలోనూ ఆంక్షలు పెట్టారు. గత మూడు ఏళ్లుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తూ కరోనా మన ఆరోగ్య రంగానికే సవాలు విసురుతోంది. దీన్ని పూర్తిగా పారద్రోలడం ఎలాగో తెలియక వైద్యశాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఒక కొత్త అధ్యయనంలో ఓ సంచలన విషయం బయటపడింది. కరోనా వచ్చి తగ్గాక ఫలితం నెగిటివ్ చూపిస్తున్నప్పటికీ, ఆ వైరస్ మెదడులో ఎనిమిది నెలల పాటు కొనసాగుతుందనం ఈ అధ్యయనం తేల్చింది. మెదడు మాత్రమే కాదు గుండె, శోషరస గ్రంధులు, ప్రేగులు, అడ్రినల్ గ్రంధి, శ్వాసకోశం ఇలా విభిన్న కణజాలాలలో కరోనా వైరస్ నివసించే అవకాశం ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది.
ఈ అధ్యయనంలో భాగంగా అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు కరోనా వైరస్‌తో మరణించిన కొంతమంది మృతదేహాలపై అధ్యయనం నిర్వహించారు. వారి మృతదేహాల నుండి నమూనాలను సేకరించారు. అందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 11 మంది రోగులలో మెదడుతో సహా నాడీ వ్యవస్థలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. అది కూడా వారు మరణించిన ఎనిమిది నెలల దాకా అలాగే ఉన్నాయి. వారెవరూ కూడా టీకాలు వేసుకోలేదు. నేచర్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం వివరాల ప్రకారం కరోనా వైరస్ శ్వాస మార్గాన్ని, ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీసినట్లు చూపించింది. అలాగే ఒక రోగి దేహంలో మెదడులోని హైపోథాలమస్, సెరెబెల్లంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. మరో ఇద్దరు రోగుల దేశంలో వెన్నుపాములో కరోనా వైరస్ ప్రోటీన్లు గుర్తించారు. దీన్ని బట్టి కరోనా సోకాక అది శరీరంలోని ప్రతి అవయవానికి చేరుతోందని అర్థమవుతుంది. వైరస్ సోకాక కొన్ని రోజులకు నెగటివ్ ఫలితంగ రాగానే కరోనా పోయిందని భావించడానికి వీల్లేదు. అది శరీరంలో ఎక్కడో దగ్గర ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. అందుకే కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడమే ఉత్తమం.
కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో దాని వల్ల కేవలం ఊపిరితిత్తులకే నష్టం అనుకున్నారంతా, కానీ అది మెదడు వరకు చేరే స్థితికి వచ్చింది. దీని వల్ల మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం, రక్తం గడ్డ కట్టడం, హైపర్ ఇంప్లమేటరీ రెస్పాన్స్ వంటి కారణాలు కనిపించవచ్చు. కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో దీర్ఘకాలిక ప్రభావాలు ఉండే అవకాశం అధికంగానే ఉందని చెబుతన్నారు పరిశోధకులు.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలో రాళ్లు చేరాయని అర్థం, జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.