Covid-19 Transmission: కరోనా రోగి కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి.. ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే
కరోనా రోగి తుమ్మినా, తగ్గినా ఆ తుంపర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది కొత్త విషయమేం కాదు. అయితే కరోనా రోగి కన్నీళ్లలో కూడా వైరస్ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.
కరోనా రోగి కన్నీళ్ల నుంచి సైతం వైరస్ వ్యాప్తి అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమృత్ సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేసిన తాజా అధ్యయనంలో పలు విషయాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయనం ప్రకారం.. కరోనా రోగి కన్నీళ్లు కూడా వైరస్ ను వ్యాప్తి చేయగలవని తేలింది. అయితే ఇతర మార్గాల ద్వారా జరిగే వైరస్ వ్యాప్తి కంటే ఇది ప్రమాదకరమా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఓకులర్ మేనిఫెస్టేషన్..
ఏదైనా శరీరంలోని ఓ అవయవానికి ఇన్ఫెక్షన్ సోకి ఆ ప్రభావంతో కంటికి ఏర్పడే పరిస్థితిని ఓకులర్ మేనిఫెస్టేషన్ అంటారు. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది రోగుల కన్నీళ్లను ఆర్‌టీ- పీసీఆర్ విధానం ద్వారా 48 గంటల్లోగా పరీక్షించారు.
ఏం తేలిందంటే..
120 మంది రోగుల్లో 21 మంది నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. మరో 11 మందికి నమూనాల్లో కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 10 మందిలో ఎలాంటి ప్రభావం లేదు. ఈ పరీక్షల అనంతరం కరోనా రోగుల కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. కనుక కొవిడ్19 రోగులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని సూచించారు. ఇందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ మేరకు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో కూడా ఓ కథనం ప్రచురితమైంది.
Also Read: Mobile Phones in ICU: ఐసీయూలోకి మొబైల్ తీసుకువెళ్తే ఏమౌతుంది?
కరోనా విజృంభణ..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 40,134 కొవిడ్19 కేసులు నమోదవగా, మరో 422 మంది కరోనా మహమ్మారితో మరణించారు. ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 46,96,45,494 కరోనా శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్లు భారత వైద్య, పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న 14,28,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ లోపు వీలైనంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
దేశంలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన నగరంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సౌత్ ఈస్ట్ జోనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
Also Read: Drones Spotted, Jammu Kashmir: మరోసారి జమ్మూలో డ్రోన్ల కలకలం.. భద్రతా దళాలు అప్రమత్తం