Delta Variants: ఒకే వ్యక్తిలో రెండు వేరియంట్లు.. అస్సాంలో ఘటన
Alpha and Delta variants: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే అది తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఆల్ఫా, డెల్టా వంటి వేరియంట్ల రూపంలో మరింతగా విరుచుకుపడుతోంది.
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే అది తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఆల్ఫా, డెల్టా వంటి వేరియంట్ల రూపంలో మరింతగా విరుచుకుపడుతోంది. తాజాగా ఓ మహిళా డాక్టర్ రెండు వేరియంట్ల బారిన పడటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
అస్సాం రాష్ట్రంలోని ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి ఆల్ఫాతో పాటు ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. ఇదే విషయాన్ని అక్కడి లాహోవాల్‌లోని ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్‌ఎంఆర్‌సీ) నోడల్ అధికారి డాక్టర్ బిశ్వ జ్యోతి బొర్కాకోటి సైతం ధ్రువీకరించారు. బాధిత వైద్యురాలికి ఇటీవల కరోనా సోకగా.. ఆమె శాంపిళ్లను పరీక్షించామని.. అందులో ఆల్ఫా, డెల్టా వేరియంట్లను (SARS-CoV-2) కనుగొన్నట్లు తెలిపారు. దీంతో మరోసారి వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు శాంపిళ్లను పంపామని చెప్పారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలోనూ రెండు వేరియంట్ల ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
బాధిత వైద్యురాలు, ఆమె భర్త ఇద్దరూ వైద్యులని.. వారు నెల క్రితం కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని బిశ్వ జ్యోతి చెప్పారు. వైద్యురాలి భర్తకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. అయితే ఆయనలో కేవలం ఆల్ఫా వేరియంట్ మాత్రమే ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో ఆమె ఆస్పత్రిలో చేరలేదని వెల్లడించారు.
ఒకేసారి రెండు వేరియంట్లు సోకడాన్ని ‘డబుల్ ఇన్ ఫెక్షన్’ అంటారని బిశ్వ జ్యోతి తెలిపారు. ఓ వ్యక్తి ఏదైనా వేరియంట్ బారినపడిన రెండు మూడు రోజుల్లో కానీ, లేదా యాంటీబాడీలు ఉత్పత్తి కావడానికి ముందుగా కానీ ఇలా మరో వేరియంట్ కూడా సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. యూకే, బ్రెజిల్, పోర్చుగల్ వంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి కేసులు గుర్తించారని.. భారతదేశంలో మాత్రం ఇప్పటివరకు నమోదు కాలేదని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల బెల్జియానికి చెందిన ఓ వృద్ధురాలిలో (90 ఏళ్లు) ఒకేసారి ఆల్ఫా, బీటా వైరస్ వేరియంట్లు కనిపించాయి. అయితే ఆమె వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో 2021 మార్చిలో మరణించారు.
దేశంలో పెరిగిన కరోనా కేసులు..
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.12 కోట్లకు చేరింది. దేశంలో కొత్తగా 3,998 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4.18 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,07,170 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 3.03 కోట్ల మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 97.36 శాతానికి చేరుకుంది.