తెలంగాణలో పది, ఏపీలో ఐదు పాజిటివ్ కేసులు- కరీంనగర్‌లో నర్సుకు కరోనా
Telangana Corona Cases: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 14 కేసులు నమోదైనట్టు తేలింది. ఇందులో రెండు కొత్త వేరియంట్‌గా గుర్తించారు.
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 10 కేసులు నమోదు కావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొన్న జయశంకర్ భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులకు పాజిటివ్ నిర్దారణ అయింది. ఇప్పుడు కరీంనగర్‌లో మరో కేసు నమోదు అయ్యాయి. ఇన్నాళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్ ఇప్పుడు జిల్లాలకు పాకిందనే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. కరోనా ప్రమాదకరం కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
24 గంటల్లో 10 కేసులు
ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 9 కేసులు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చినవే. మరొకటి కరీంనగర్‌లో వెలుగు చూసింది. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు కోలుకున్నారు. 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది ప్రభుత్వం. ఇంకా 12 మంది రిపోర్టు రావాల్సి ఉందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు నమోదు కాలేదని మాత్రం అధికారులు గట్టిగా చెబుతున్నారు.
కరీంనగర్‌లో కేసులు
హైదరాబాద్ వెలుప వరుసగా రెండో రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. ఓ ఆసుపత్రిలో నర్సుకు కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పెద్దపల్లిలో కూడా నమోదు అయినట్టు చెబుతున్నారని కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. వారిద్దరి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారికి సన్నిహితంగా ఉండే వాళ్లను, బంధువులను కుటుంబ సభ్యులను కూడా పరీక్షించారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లిలో వెలుగులోకి వైరస్ బాధితులు కోలుకుంటున్నారు. వారిని వరంగల్ ఎంజీఎంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. 24గంటల్లో 5 కోత్త కేసులు నమోదు అయ్యాయి. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.
కరోనా వచ్చిన వారిలో కొందరు జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉన్నాయి. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. వీరి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో రెండు కొత్త వేరియంట్ కేసులు
దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి.