Coronavirus Origin: అడ్డం తిరిగిన చైనా.. వుహాన్ ల్యాబ్ దర్యాప్తునకు ససేమిరా!
కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా షాకిచ్చింది. ఇకపై వుహాన్ ల్యాబ్ గురించి దర్యాప్తు చేయకూడదని తేల్చిచెప్పింది. ఇందుకు సహకరించేది లేదని స్పష్టం చేసింది.
వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్‌పై దర్యాప్తును వీలైనంత మేరకు అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ఇదే అంశంపై మరోసారి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించడంపై చైనా మండిపడింది. ల్యాబ్ లీక్‌పై ఎటువంటి ఆధారాలు లేవని చైనా నిపుణులు అంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన చైనా నిపుణుల బృందానికి అధ్యక్షత వహిస్తున్న లియాంగ్ వాన్నియన్ గురువారం బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ వైరస్ సహజంగా జంతువుల్లోంచి మరో ఆతిథ్య జంతువులోకి చేరి.. అక్కడి నుంచి మనుషులను సోకిందని వెల్లడించారు. ల్యాబ్ లీక్ సిద్ధాంతం అసంభవమని పేర్కొన్నారు. వుహాన్ ల్యాబ్‌లో అసలు కరోనా వైరస్‌లే లేవని చెప్పారు. అలాంటప్పుడు దానిపై వనరులను ఖర్చుచేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని తేల్చేశారు.
ఇప్పటికే చాలాసార్లు ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని కొట్టిపారేసిన చైనా గురువారం మరో అడుగు ముందుకేసింది. ఇంతకు మించి దర్యాప్తు చేసేది లేదని తేల్చేసింది. ఈ సిద్ధాంతం ఎంత ప్రచారంలో ఉన్నా.. చైనా దర్యాప్తులో భాగస్వామిగా ఉండబోదని పేర్కొంది. ఈ దర్యాప్తుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపును చైనా తొలిసారి నేరుగా తిరస్కరించింది.
కరోనా వైరస్ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని వుహాన్‌లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు.
"కరోనా వైరస్ మూలాలను తెలుసుకునేందుకు చైనా తప్పనిసరిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం" అని జెనీవాలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. "పీ4 ల్యాబ్‌లోని యానిమల్ రూమ్‌లో వివిధ జంతువులు ఉండొచ్చు. సార్స్‌కోవ్-2 వంటి వాటిపై కూడా పరిశోధన చేయవచ్చు" అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు.