మనకు తెలియకుండానే మెదడులో చేరే అమీబా, బ్రెయిన్ తినేస్తుంది - ఇది ఎలా శరీరంలో చేరుతుంది?
ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చి పడుతుందో తెలియదు, వైరస్, బ్యాక్టిరియాలే కాదు ఇప్పుడు అమీబాలు ఒంట్లో చేరి ప్రాణాలు తీసేస్తున్నాయి.
దక్షిణా కొరియాలో ఒక వింత కేసు బయటికొచ్చింది. మెదడు తినే అమీబా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అమీబా వల్ల మనిషి చనిపోవడంతో ఆ వార్త వైరల్‌గా మారింది. ఆ అమీబా పేరు ‘నెగ్లెరియా ఫౌలెరీ’. థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన దక్షిణ కొరియాకు చెందిన పౌరుడు ఈ అమీబా బారిన పడి చనిపోయినట్టు గుర్తించారు. ఆ అమీబా వల్ల తీవ్రమైన మెదడు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అది మెల్లగా మెదడును తినడం మొదలుపెడుతుంది. దీంతో మెదడు కుళ్లిపోయినట్టు అవుతుంది. మొదటిసారి ఈ అమీబా వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ను 1937లో అమెరికాలో కనుగొన్నారు.
ఎలా శరీరంలోకి చేరుతుంది?
అమీబా స్వేచ్చాజీవులు. ఏక కణ జీవులు. కంటికి కనిపించని సూక్ష్మ జీవులు. ఇవి సాధారణంగా నేలపై, వెచ్చని మంచి నీటి సరస్సుల్లో నివసిస్తాయి. ఎవరైనా అమీబాలు నిండిన సరస్సులో ఈత కొట్టినప్పుడు అవి ముక్కు, లేదా నోరు ద్వారా శరీరంలో చేరుతాయి. అక్కడ్నించి నేరుగా మెదడును చేరే అవకాశం ఉంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అంచనా ప్రకారం అమెరికాలో ఏడాదికి ముగ్గురు వ్యక్తులు దీని కారణంగా మరణిస్తున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
ఈ అమీబా శరీరంలోకి చేరాక లక్షణాలు బయటపడడడానికి రెండు నుంచి 15 రోజుల సమయం పడుతుంది. లక్షణాలు కనిపించడం ప్రారంభైన మూడు నుంచి రోజుల్లోపు మరణం సంభవించవచ్చు. అమీబా శరీరంలోకి చేరాక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే...
1. తలనొప్పి
2. జ్వరం
3. కోమాలోకి వెళ్లొచ్చు
4. వాంతులు అయ్యే అవకాశం
5. భ్రాంతులు కలుగుతాయి
6. రుచి కోల్పోవడం
7. మసక దృష్టి
8. మెడ గట్టిగా పట్టేసినట్టు అవుతుంది.
చికిత్స
దీనికి అంత ప్రభావవంతమైన చికిత్స లేదు. ఎందుకంటే వైద్యులు అసలు ఎందుకు అనారోగ్యం పాలయ్యారో తెలుసుకునేలోపే కొంతమంది మరణిస్తారు. ప్రాణాలతో ఉన్నప్పుడే గుర్తిస్తే ఆ అమీబాపై ప్రభావం చూపే మందులను ఇస్తారు. అంత ప్రభావవంతమైన చికిత్స మాత్రం లేదు.
Also read: తందూరి చికెన్‌లాగే, తందూరి ఎగ్ రెసిపీ - ఒక్కసారి తిని చూడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.