Premalatha Vijayakanth: నాన్న ఇంప్రెస్ అయ్యారు, నేను ప్రేమలో పడ్డా! విజయకాంత్‌తో పెళ్లి గురించి ప్రేమలత చెప్పారంటే?
Premalatha Vijayakanth: తమిళ హీరో విజయ్ కాంత్ తో పెళ్లి గురించి ఆయన భార్య ప్రేమలత ఆసక్తిర విషయాలు వెల్లడించారు. ఆయనను చూడగానే ప్రేమలో పడినట్లు వివరించారు.
Premalatha Vijayakanth Love Story: తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన ఇకలేరు అనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
విజయ్ కాంత్, ప్రేమలత ప్రేమకథ
విజయ్ కాంత్ మరణంతో ఆయనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాల గురించి అభిమానులు, నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లవ్ స్టోరీ నెట్టింట్ల వైరల్ అవుతోంది. విజయ్ కాంత్ వివాహం ప్రేమలతతో 1990 జనవరి 31న జరిగింది. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వారిలో షణ్ముఖ పాండ్యన్ నటుడిగా తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.గత కొంత కాలం క్రితం విజయ్ కాంత్ భార్య ప్రేమలత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి కీలక విషయాలు వెల్లడించారు.
పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడిన ప్రేమలత
పెళ్లి చూపుల్లోనే విజయ్ కాంత్ తో ప్రేమలో పడినట్లు ప్రేమలత తెలిపారు. “మాది పెళ్లి సంప్రదాయబద్దంగా జరిగింది. పెద్దలు కుదిర్చారు. మా ఇద్దరి పెళ్లి స్వర్గంలోనే జరిగిందని నేను భావిస్తాను. మా అనుబంధాన్ని చూసిన ఎవరైనా ఇదే విషయాన్ని చెప్తారు. విజయ్ కాంత్ మధురైకి చెందిన వాడు. మేము వేల్లూరులో ఉండేవాళ్లం. మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. పెళ్లి చూపుల కోసం విజయ్ కాంత్ తొలిసారి మా ఇంటికి వచ్చారు. ఆయన నడవడిక చూసి మా నాన్న చాలా ఇంప్రెస్ అయ్యారు. నా కూతురు చేసుకోబోయేది ఇతడినే అని బలంగా నమ్మారు. విజయ్ మా ఇంట్లో హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిలా నడుచుకోవడం చాలా నచ్చింది. పెళ్లి చూపుల రోజు మా ఇంటికి కాషాయ దుస్తుల్లో వచ్చారు. ఆ సమయంలో ఆయన మాల ధరించి శబరిమలై వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. ఆయన గురించి పెద్దగా తెలియకపోయినా చక్కటి ప్రవర్తన మా వాళ్లు బాగా నచ్చి పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి చూపుల తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. పెళ్లి ముందు ఇద్దరం ఫ్రెండ్లీగా మారాం. పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నాం” అని ప్రేమలత వివరించారు.
Also Read: విజయకాంత్‌ను హత్య చేసిన వాళ్ళను పట్టుకోకపోతే సీఎంనూ చంపేస్తారు - దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
1979లో సినీ ప్రవేశం
విజయ్ కాంత్ ఆగష్టు 25, 1952 నాడు మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ విజయ్ రాజ్ అలగర్ స్వామి. 1979లో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఇంకుమ్ ఇలమై’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి సారి 2015లో ‘సగప్తామ్’లో కనిపించారు. ఆయన కెరీర్ లో 100వ సినిమాగా ‘కెప్టెన్ ప్రభాకరన్’ మూవీ తెరకెక్కింది. అప్పటి నుంచి ఆయనను అందరూ కెప్టెన్ అని పిలవడం మొదలుపెట్టారు.