Vijay Devarakonda: స్పై థ్రిల్లర్‌లో రౌడీ బాయ్ - డైరెక్టర్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను ప్రకటించారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ ఫేమ్ గౌతం తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం అందించనున్నారు. తన మొదటి రెండు సినిమాలకు భిన్నంగా ఈ సారి పూర్తిగా యాక్షన్ సబ్జెక్ట్ తీసుకున్నాడని అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూసి తెలుసుకోవచ్చు.
పోస్టర్ మీద "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అని రాసుండటం గమనించవచ్చు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.
ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తుంది.
ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇతర స్టార్ కాస్ట్, టెక్నికల్ క్రూ గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘ఖుషి’ సినిమా మాత్రమే ఉంది. సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్డ్‌లో పడింది. దీంతో విజయ్ ఈ సినిమాను వెంటనే ప్రారంభించే అవకాశం ఉంది.
సమంత అనారోగ్యం కారణంగా డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఖుషి వాయిదా పడింది. షూటింగ్ ప్రారంభం అయితే కానీ ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి మాత్రం ‘ఖుషి’ సమ్మర్‌లో విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి.
‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న గౌతం తిన్ననూరి ‘జెర్సీ’ రీమేక్‌తో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. తెలుగు ‘జెర్సీ’కి నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం. గౌతం తిన్ననూరి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దీంతో గౌతం ఆశలు కూడా ఈ ప్రాజెక్టు మీదనే ఉన్నాయి.
View this post on Instagram