Vidya Vasula Aham Teaser: ‘మద్యం అలవాటు లేదా... మధ్యాహ్నం అలవాటు లేదు’ - ఫన్నీగా ‘విద్య వాసుల అహం’ టీజర్!
Vidya Vasula Aham: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న ‘విద్య వాసుల అహం’ టీజర్ విడుదల అయింది.
Vidya Vasula Aham: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ‘విద్య వాసుల అహం’. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘విద్య వాసుల అహం’ చిత్రానికి 'తెల్లవారితే గురువారం' ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే... ఫన్నీ ఎలిమెంట్స్‌తో నవ్వులు పూయించారు. పెళ్లి వద్దు అనుకునే విద్య (శివాని రాజశేఖర్), పెళ్లి మాత్రమే వద్దు అనుకునే వాసు (రాహుల్ విజయ్) అనుకోని విధంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అనంతరం వారి జీవితంలో తలెత్తే ఇగో సమస్యలను ఫన్నీగా, ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది.
‘అమ్మాయిలని పడేయడం కష్టం కాదు మాస్టారూ... అమ్మాయిలతో పడటమే కష్టం’, ‘మద్యం అలవాటు లేదా... మధ్యాహ్నం అలవాటు లేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే శివాని, రాహుల్ విజయ్‌ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను కూడా టీజ్ చేశారు. ఇవి యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది.
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇటీవలే ‘కోటబొమ్మాళి’లో కూడా కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ అందుకుంది. నవంబర్ 24వ తేదీన విడుదల అయిన ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.
‘విద్య వాసుల అహం’లో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అద్దూరి, కాశీ విశ్వనాథ్, రూపాలక్ష్మి, రాజశ్రీ నాయర్, వైవా రాఘవ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం: అఖిల్ వల్లూరి, ఎడిటర్: సత్య గిడుటూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్ మక్కెన.