Gandeevadhari Arjuna Trailer: 2020 డిసెంబర్‌లో దేవుడిపై మనిషి గెలిచాడా? - యాక్షన్ ప్యాక్డ్‌గా ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్!
వరుణ్ తేజ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ వచ్చేసింది.
వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ సినిమా ‘గాండీవధారి అర్జున’. ‘పీఎస్వీ గరుడవేగ’, ‘ఘోస్ట్’ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ తెరకెక్కింది. ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ట్రైలర్ ఎలా ఉంది?
‘2020 డిసెంబర్‌లో దేవుడి మీద మనిషి గెలిచాడంట? కేవలం 25 వేల సంవత్సరాల్లో మనిషి చేసిన వస్తువులు దేవుడు చేసిన వాటిని మించేశాయంట. ఎలాగో తెలుసా?’ అంటూ నాజర్ అనడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఆదిత్యరాజ్ బహదూర్‌గా నాజర్ స్క్రీన్ మీద కనిపిస్తారు. ఆయనకు దుండగుల నుంచి ముప్పు ఉంటుంది.
దీంతో ఏజెన్సీ నుంచి ఆయనను రక్షించడం కోసం వచ్చే ఏజెంట్ అర్జున్‌గా వరుణ్ తేజ్ కనిపించారు. హీరోయిన్ సాక్షి వైద్య కూడా అదే ఏజెన్సీలో ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ‘క్లయింట్ అయినా సరే తప్పు చేస్తే నేనే చంపేస్తాను.’ అని వరుణ్ తేజ్ అనడం ఆయన క్యారెక్టర్ మీద క్లారిటీని ఇస్తుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్‌ని నాజర్ ‘నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టు చాలు’ అని అడుగుతారు.
అప్పుడే రూత్‌లెస్ బిజినెస్‌మ్యాన్ రణ్‌వీర్‌గా వాన ఫేమ్ వినయ్ రాయ్ ఎంట్రీ ఇస్తారు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నారు. వినయ్ ఎంట్రీ తర్వాత మెడికల్ ట్రయల్స్, ఒక మహిళ ఏడుస్తూ తన కథను చెప్పడం, ‘వీటితో నాకు సంబంధం ఏంటి?’ అని వరుణ్ అడిగే విజువల్స్ వస్తాయి. అక్కడ నుంచి యాక్షన్ సీన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మిలటరీ ట్యాంకర్ల మధ్య వచ్చే ఒక ఛేజ్ సీక్వెన్స్, బాత్రూం ఫైట్, మెట్రో యాక్షన్ సీన్, ఫారిన్ రోడ్లపై వచ్చే ఛేజ్... ఇలా యాక్షన్ సీన్లన్నీ చాలా రిచ్‌గా ఉన్నాయి. ‘భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో?’ అనే నాజర్ డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే... పర్యావరణ సంరక్షణ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ అని అర్థం చేసుకోవచ్చు. నాజర్‌ను పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా చూపించడం, మధ్యలో మెడికల్ మాఫియా... ఇలా అనేక రకాల అంశాలను రివీల్ చేశారు. మరి సినిమా ఎలా ఉండనుందో తెలుసుకోవాలంటే ఇంకో రెండు వారాలు ఆగాలి.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. వరుణ్ తేజ్ నటించిన చివరి సినిమా 'గని' బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం వస్తున్న ‘గాండీవధారి అర్జున’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను వరుణ్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్ జోనర్‌పై ప్రవీణ్ సత్తారుకు మంచి పట్టు ఉంది. ఆయన ఇంతకుముందు చేసిన ‘పీఎస్వీ గరుడవేగ’, ‘ఘోస్ట్’ సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదే తరహాలో ఈ సినిమాలోనూ మోతాదు కంటే ఎక్కువగానే యాక్షన్ కంటెంటే కనిపిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ‘గాండీవధారి అర్జున’ ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.