Chiranjeevi: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?
టాలీవుడ్ సినీ పెద్దలు ఆదివారం (ఆగస్టు 15) రాత్రి చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి బాలకృష్ణ, మోహన్ బాబు కనిపించకపోవడం చర్చనీయమైంది.
మెగాస్టర్ చిరంజీవి ఇంట్లో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలంతా ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రికి నివేదించాల్సిన అంశాలపై చర్చించారు.
ఈ భేటీలో హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ మూవీస్ రవి ప్రసాద్, నారాయణ మూర్తి, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్, కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి.కళ్యాన్, ఎన్వీ ప్రసాద్, దర్శకులు కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రీయ, యూవీ క్రియేషన్స్ బాబీ, వంశీతోపాటు నిర్మాతల సంఘం, పంపిణీ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
సాయంత్రం 5 గంటలకు మొదలైన ఈ సమావేశం రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. లాక్‌డౌన్ వల్ల సినీ, థియేటర్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను జగన్‌కు వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే బీ, సీ సెంటర్లలో టికెట్ ధరలు, విద్యుత్ టారిఫ్‌ల గురించి కూడా చర్చించారు. ఇటీవల ఏపీలో జారీ జీవో, చిన్న నిర్మాతల సమస్యలు గురించి సీఎం బేటీలో మాట్లాడాలని నిర్ణయించారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లోని థియేటర్ల టిక్కెట్టు ధరలు, చిన్న సినిమాల మనుగడ కోసం 5 షోలకు అనుమతివ్వాలని సీఎంకు కోరనున్నట్లు తెలిసింది. విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.
బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?: ఈ సమావేశంలో బాలకృష్ణ, మోహన్‌బాబులు కనిపించకపోవడం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో వారిద్దరు జగన్‌తో జరిగే సమావేశానికి హాజరవుతారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. చిరంజీవి వారిని ఆహ్వానించారా? లేదా ఆయన ఆహ్వానించినా వారు హాజరు కాలేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్‌తో టాలీవుడ్ పెద్దల సమావేశం ఎప్పుడనేది ఇంకా తెలియరాలేదు. ఆగస్టు 18 లేదా 19 తేదీల్లో తమకు అపాయిట్మెంట్ కావాలని చిరంజీవి కోరినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?
Also Read: తన బాధ్యత నాదే.. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం అదే, రష్మీ భావోద్వేగం.. సుధీర్ గుడ్ న్యూస్!