Maa Elections 2021: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?
‘మా’ ఎన్నికలు ‘చిరంజీవి vs మోహన్ బాబు’గా మారనున్నాయి. చిరు మద్దతు ఎవరికీ? మెగాస్టార్ లేఖతో మంచు విష్ణు ఏకగ్రీవ ఎన్నిక అవకాశాలు సన్నగిల్లాయా?
‘మా’ ఎన్నికలు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. మొన్నటివరకు నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా మాటల యుద్ధం సాగింది. ఆ వేడి ఇంకా చల్లారక ముందే.. నటి హేమా ‘మా’ అధ్యక్షుడు నరేష్ మీద విమర్శలు గుప్పిస్తూ ఆమె పంపిన ఆడియో మెసేజ్‌పై పెద్ద రచ్చే జరిగింది. ‘మా’ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలపై నరేష్, జీవిత ఘాటుగానే స్పందించారు. హేమ మాటలను తప్పుడు ఆరోపణలు చేస్తుందని, అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాలు ‘మా’ పరువును తీసేలా ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగక తప్పలేదు. వెంటనే ‘మా’ ఎన్నికలు జరపాలంటూ చిరు.. ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.
చిరు లేఖ.. నరేష్, మందు విష్ణు మద్దతుదారులకు కాస్త ఇబ్బందిగానే మారింది. వర్గాలుగా విడిపోయిన మా సభ్యులు.. నరేష్‌నే అధ్యక్షుడిగా కొనసాగించాలని వాదిస్తుంటే.. మరికొందరు మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని అంటున్నారు. విష్ణు కూడా పెద్దలు అంగీకరిస్తేనే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమైన ప్రకాశ్ రాజ్, హేమ వర్గాలు కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవి లేఖతో ఈ వర్గానికి మరింత ధైర్యం లభించింది.
ప్రస్తుతం ఈ ఎన్నికలు ‘మా’కు సొంత బిల్డింగ్ కట్టాలనే హామీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అంతా విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే, చిరు రాసిన లేఖను క్రమశిక్షణ సంఘం పరిగణనలోకి తీసుకుంటే.. ఎన్నికలు తప్పకపోవచ్చు. ‘మా’ ఎన్నికలు వెంటనే నిర్వహించకపోతే.. సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని చిరు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలపై ఇప్పటికే సభ్యులు చేస్తున్న ప్రకటనల వల్ల ‘మా’ ప్రతిష్ట దెబ్బ తింటోందని ఆయన తెలిపారు. ఎన్నికలు వెంటనే నిర్వహించకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు. ఈ లేఖ మంచు విష్ణు వర్గాన్ని ఆలోచనల్లో పడేసింది. ఎన్నికలు జరిగితే విష్ణుకు గెలిచే అవకాశం ఉంటుందా అనే సందేహాలు నెలకొన్నాయి.
టాలీవుడ్‌లో ఒకప్పుడు చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఏదో వివాదం నడుస్తూనే ఉండేది. అయితే, ఈ మధ్య వీరు విబేధాలను పక్కన పెట్టి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే, మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలనే డిమాండు వినిపిస్తున్న సమయంలోనే చిరంజీవి.. ఎన్నికలు నిర్వహించాలనే లేఖ రాయడం వెనుక ‘మతలబు’ ఏమిటనేది హాట్ టాపిక్‌గా మారింది. మోహన్ బాబుతో ఉన్న విభేదాల వల్లే ఆయన ఇలా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, చిరంజీవి ఆ ఉద్దేశంతో ఈ లేఖ రాయలేదని, రోజు రోజుకు ముదురుతున్న వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టాలనే కారణంతో పెద్ద మనిషిగా స్పందించారని, ఎన్నికలు నిర్వహించాలని కోరడంలో తప్పు ఏముందని చిరు అభిమానులు అంటున్నారు. పైగా ఆ లేఖలో ఆయన ఎవరి మీద ఆరోపణలు కూడా చేయలేదని తెలుపుతున్నారు.
అయితే, ప్రకాశ్ రాజ్‌కు చిరంజీవి మద్దతు ఉందని, అందుకే ఆయన ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారని పలువురు తెలుపుతున్నారు. ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలాన్ని ఇస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే ఈ ఎన్నికలు ‘చిరంజీవి vs మోహన్ బాబు’లా మారతాయని అంటున్నారు. అయితే, ‘మా’ ఎన్నికల గురించి మోహన్ బాబు ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరు అధ్యక్షత వహించినా స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. తండ్రిగా తన కుమారుడు విష్ణుకు మద్దతు కూడగట్టడంలో మాత్రం ఆయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఆయన విష్ణుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలిసి మంతనాలు జరిపారు. ‘మా’ ఎన్నికల్లో మద్దతు కోరేందుకే మోహన్ బాబు ఆయన్ని కలిశారనే ప్రచారం సాగుతోంది.
ఒకప్పుడు మా ఎన్నికలన్నీ ఏకగ్రీవంగానే జరిగేవి. నటీనటులు, నిర్మాతలు సభ్యులంతా ఒకే మాట మీద ఉండేవారు. అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా మద్దతు తెలిపేవారు. అయితే, ఇటీవల ఆ సాంప్రదాయానికి స్వస్తి చెబుతూ ఎన్నికలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నారు. అధ్యక్షుడి పదవిలో తాముంటే ఇంకా మంచి చేస్తామని చెబుతున్నారు. ఏకగ్రీవ ఎన్నికకు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. పోటీదారులు కూడా పెరిగారు. మరి ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్న మోహన్‌బాబు, చిరంజీవిల మద్దతు ఎవరికి ఉంటుందో చెప్పడం కష్టమే. ప్రస్తుతమైతే చిరంజీవి డిమాండ్ మేరకు ఎన్నికలు జరుగుతాయా? లేదా అంతా ఏకగ్రీవంగా మంచు విష్ణును అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
Also Read: ప్రకాశ్ రాజ్ సంచలనాల ట్వీట్.. ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చ..
ఇదిలా ఉండగా.. ‘మా’ వ్యవస్థాపక సభ్యుడు మానిక్ సైతం రంగంలోకి దిగారు. ‘మా’ అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు పంపారు. అధ్యక్షుడు నరేష్‌పై ఆరోపణలు చేయడం సబబు కాదని.. అలా మాట్లాడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని, ఆయనకి 110 సభ్యుల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బంతి ఇప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కోర్టులోనే ఉంది. మరి ఆయన ‘మా’ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకోస్తారో లేదో చూడాలి. అయితే, టాలీవుడ్‌లో ఇలాంటి వివాదాలను ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడూ స్వాగతించరు. చిరంజీవి, మోహన్‌బాబుల స్నేహాన్నే అంతా ఇష్టపడతారు. కాబట్టి ఈ ఎన్నికలు ‘చిరంజీవి vs మోహన్ బాబు’లా కాకూడదనే అంతా కోరుకుంటున్నారు.
Also Read: ‘టాలీవుడ్ బాస్’ పాత్రకు చిరంజీవి న్యాయం చేయలేకపోతున్నారా..!?