Mani Sharma: 'చూడాలని వుంది'లో చిరంజీవికి నచ్చకపోయినా ఆ పని చేశా: మణిశర్మ
ప్రముఖ నటుడు అలీ హోస్ట్ గా చేస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మణిశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు.
టాలీవుడ్ లో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి తెలియని సంగీత ప్రియులుండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ ను అందించారు. ఆయన మెలోడీ పాటలకు పెట్టింది పేరు. అందుకే ఆయన్ను మెలోడీ బ్రహ్మ అని పిలుస్తుంటారు. ఇప్పటికీ ఆయన సంగీతంతో మ్యూజిక లవర్స్ ను అలరిస్తున్నారు మణిశర్మ. ఎప్పుడూ పెద్దగా బయట కనిపించని ఆయన చాలా కాలం తర్వాత ఓ టాక్ షో కనిపించారు. ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్ గా చేస్తోన్న ‘ఆలీతో సరదా’గా కార్యక్రమంలో మణిశర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పాటల గురించి, వ్యక్తి గత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది.
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన ఆయన మణిశర్మ గానే అందరికీ పరిచయం. స్క్రీన్ పై కూడా ఇదే పేరు ఉంటుంది. అయితే మణిశర్మ అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ‘ఆలీతో సరదాగా’లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. అయితే ఏ.వి.యస్. తొలిసారి దర్శకత్వం వహించిన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన దాదాపు 200 పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. సంగీత దర్శకుడుగా ఆయనకొచ్చిన తొలి సినిమా చిరంజీవి చిత్రమే అయినా విడుదలయింది మాత్రం 'సూపర్ హీరోస్'. అప్పటినుంచీ వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పలు సినిమాలకు పనిచేస్తూ బిజీగా ఉంటున్నారాయన.
చిరంజీవికి నచ్చకపోయినా చేశా: మణిశర్మ
ఈ టాక్ షో లో ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మణిశర్మ. సంగీతం నేర్చుకునే విషయంలో తన తండ్రి పండితుడు అయితే తాను పరమ శుంఠని అని, నాన్న నాలుగు తగిలిస్తే గాని తాను సంగీతం సరిగ్గా నేర్చుకునేవాణ్ణి కాదని అన్నారు. తను చేసే పని మనసుకు నచ్చేదాకా చేసేవాణ్ణి కాదని, దాని వల్ల ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. 'చూడాలని ఉంది' సినిమాలో 'రామ్మా చిలకమ్మా' పాటను బాల సుబ్రహ్మణ్యంను కాదని ఉదిత్ నారాయణతో పాడించానని అన్నారు. అది చిరంజీవికి కూడా నచ్చలేదని.. అయినా చేయాల్సి వచ్చిందని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఏ.ఆర్.రెహమాన్, తానూ మంచి కీ బోర్డ్ ప్లేయర్స్ అని, ఇద్దరూ కలిసి చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నామని చెప్పారు. రెహమాన్ తనను ‘‘ఎన్నవోయ్’’ అని సరదాగా పిలిచే వారని చెప్పుకొచ్చారు.
Also Read: ఇక ఆపండి చాలు - క్యాన్సర్ వార్తలపై మమతా మోహన్ దాస్ ఫైర్
అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది: మణిశర్మ
ఈ ఇంటర్వ్యూ లో మరో ఇంట్రెస్టింగ్ విషయం పై కూడా మణిశర్మ స్పందించారు. తమన్ వచ్చిన తర్వాత మణిశర్మతో పనిలేదు అనుకున్నవారికి మీ సమాధానం ఏమిటీ అని ఆలీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని సమాధానమిచ్చారు మణిశర్మ. 'ఇస్మార్ట్ శంకర్' లాంటి మంచి కాంబో తర్వాత మళ్ళీ 'లైగర్'లో ఎందుకు అవకాశం ఇవ్వలేదు అన్న ప్రశ్నలకూ ఆయన సమాధానం చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ టాక్ షో పూర్తి ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది.