Sirivennela Live Updates: తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి సిరివెన్నెల : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మంగళవారం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.
Background
పాటలు రాసిన తొలి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. ఆయన్ను గేయ రచయిత అనడం కంటే కవి అనడం సబబు. సినిమా పాటకు పేరు తీసుకొచ్చిన కవి ఆయన. ఎన్నో వేల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన ఇకలేరు.
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్లిపోయారు. ఈ రోజు (నవంబర్ 30, 2021) కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ నెల 22న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మధ్యలో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే... కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. మళ్లీ సోమవారం 'సిరివెన్నెల' పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒక్క రోజు గడిచిందో... లేదో... ఆయన లేరనే వార్త వినాల్సి వచ్చింది.
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. చేంబోలు ఆయన ఇంటి పేరు. ఆయన జన్మించినది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివనిలో జన్మించారు. చేంబోలు వేంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన తొలి సంతానం. అక్కడ నుంచి స్వస్థలమైన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లికి వేంకట యోగి వచ్చారు. 'సిరివెన్నెల' బాల్యం అంతా అక్కడే గడిచింది. హైస్కూల్ వరకూ అనకాపల్లిలో చదువుకున్నారు. తర్వాత 1971లో కాకినాడలోని ఆదర్శ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. 1973లో పీఆర్ కాలేజీలో బీకామ్ చేరారు. అదే ఏడాది ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. ఒక్క ఏడాది చదివారో... లేదో.. ఆయనకు 1974 సెప్టెంబర్ నెలలో టెలికాం శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగం లభించింది. రాజమండ్రిలో 1974లో... తాడేపల్లి గూడెంలో 1975లో పని చేశారు. ఆ తర్వాత కాకినాడకు ట్రాన్సఫర్ అయ్యింది. 1983 వరకూ అక్కడే పని చేశారు. ఆ కాలంలోనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. తర్వాత ఎంఏ జాయిన్ అయ్యారు. కానీ, ఓ ఏడాది తర్వాత చదువు ముగించారు.
తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి సిరివెన్నెల : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త కలిచివేసిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సాహితీ విరించి సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ. సీతారామశాస్త్రి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు : పవన్ కల్యాణ్
సీతారామశాస్త్రి మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సిరివెన్నెలను కేవలం సినీ గీత రచయితగా చూడలేమని, ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుందన్నారు. సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
తెలుగు సాహిత్యానికి శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం తీరని లోటు - JanaSena Chief Sri @PawanKalyan #SirivennelaSeetharamaSastry pic.twitter.com/AGQ7Rm6rFN
— JanaSena Party (@JanaSenaParty) November 30, 2021





















