Revanth Reddy Tollywood Meeting: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కు అంతా రెడీ - ఎప్పుడు కలుస్తారంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా ప్రముఖుల భేటీకి అంతా రెడీ అయ్యింది. ఈ వారమే మీటింగ్ జరగనుంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మర్యాదపూర్వక భేటీలు మొదలు అయ్యాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు గవర్నమెంట్ మధ్య అగ్ర నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) వారధిగా వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతోంది.
సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన టాలీవుడ్ పెద్దలు!
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన అగ్ర నేతలలో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత చిత్రసీమ నుంచి ఎవరైనా కలిశారా? అని విలేఖరులు ఓ సమావేశంలో ప్రశ్నించగా... 'లేదు. ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు' అని సమాధానం ఇచ్చారు. అయితే... ఈ రోజు ఆయనను టాలీవుడ్ పెద్దలు కలిశారు.
సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దలు, 24 శాఖలకు చెందిన వివిధ సభ్యులు కొందరు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ నెల 21న సీఎంతో టాలీవుడ్ భేటీ!
Tollywood celebrities to meet CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 21తో (గురువారం) తెలుగు చిత్రసీమ పెద్దలు భేటీ కానున్నారని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఆ భేటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా జాయిన్ కానున్నారు.
ముఖ్యమంత్రికి తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చిత్రసీమ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించనున్నట్లు సమాచారం. మన తెలుగు సినిమా ప్రముఖులలో చాలా మంది రేవంత్ రెడ్డికి సన్నిహితులు. అయితే, వ్యక్తిగత పరిచయాలు వేరు. పరిశ్రమ అంతా కలిసి వెళ్లి కలవడం వేరు కదా!
Also Read: రణబీర్ వీడియో TO దీపిక వావ్ - 2023లో బాలీవుడ్ స్టార్స్ టాప్ 10 వైరల్ ఇన్‌స్టా పోస్ట్‌లు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, అగ్ర నిర్మాత 'దిల్' రాజు నేతృత్వంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు అందరూ మంత్రి వద్దకు వెళ్లారు. మంత్రిని కలిసిన వ్యక్తుల్లో దర్శ కేంద్రులు కె. రాఘవేంద్రరావు, అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, సి. కళ్యాణ్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ అధ్యక్షులు కెఎల్ దామోదర ప్రసాద్, గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, ముత్యాల రాందాసు తదితరులు ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగా కెసిఆర్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రెండు దఫాలు కల్వకుంట్ల చంద్రశేఖర్ నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) అధికారంలోకి వచ్చింది. కెసిఆర్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగా వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వంతో పోలిస్తే... టికెట్ రేట్స్ పెంపు విషయంలో గానీ, అదనపు ఆటలు (ఎక్స్ట్రా షోస్) వేసుకునే విషయంలో గానీ అనుమతులు చాలా సులభంగా వచ్చాయి. పలు సినిమా వేడుకలకు కెసిఆర్ తనయుడు కేటీఆర్, ఆ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హాజరైన సందర్భాలు ఉన్నాయి. మరి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారో చూడాలి.