Actor Satya: గుండెపోటుతో టాలీవుడ్ హీరో కన్నుమూత
'వరం', 'బ్యాచిలర్స్' సినిమాల్లో హీరోగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. 'వరం', 'బ్యాచిలర్స్' సినిమాల్లో హీరోగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ.
సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశారు. ఆ తరువాత 'వరం' సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ అతడికి ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఏదీ వర్కవుట్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తరువాత బిజినెస్ మొదలుపెట్టారు. సాఫీగా సాగిపోతున్న సమయంలో కరోనా అతడిపై ఎఫెక్ట్ చూపించింది.
కరోనా కారణంగా తల్లిని, భార్యను పోగొట్టుకున్నారు సత్య. అప్పటినుంచి మానసికంగా ఎంతో వేదన చెందుతూ బతుకుతున్న ఆయన ఇప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకొని వంటరిగా మారింది ఆ చిన్నారి. నటుడు సత్య మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
సత్య కుటుంబ సభ్యులకు సానూభూతి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈఎస్ఐ స్మశాన వాటికలో సత్య అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు సినీ నటులు సత్య భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు స్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు.