Tiger Nageswara Rao OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Tiger Nageswara Rao: రవితేజ లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది.
Tiger Nageswara Rao OTT Release: మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సినిమా టైగర్ నాగేశ్వరరావు. నూతన దర్శకుడు వంశీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిన ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. తొలి షో నుంచే అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా పెద్దగా రాలేదు.
సైలెంట్ గా ఓటీటీలో విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’
‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను థియేట్రికల్ రిలీజ్ కు ముందే అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, ఎలాంటి హడావిడి లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్. ఇవాళ్టి(నవంబర్ 17) నుంచే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ ఓ హీరోయిన్ గా నటించింది.గాయత్రి భరద్వాజ్ మరో కథానాయికగా కనిపించింది. జయవాణి పాత్రలో తమిళ బ్యూటీ అనుకీర్తి వ్యాస్ నటించింది. హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్, 'ఆడుకాలం' నరేన్, ప్రదీప్ రావత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంచలనం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ
ప్రస్తుతం రవితేజ ‘ఈగల్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘ఈగల్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘ఈగల్’ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందులో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా, మరొకరు కావ్య థాపర్. మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘ధమాకా’తో రవితేజకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ, ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఈగల్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.