The Life Of Muthu Trailer : చంపు లేదంటే చావు - ఇది కథ కాదు, గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన సామాన్యుడి (ముత్తు) జీవితం
శింబు, గౌతమ్ మీనన్ కలయికలో రూపొందిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
కోలీవుడ్ యంగ్ స్టార్ శింబు (Simbu) కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'. తమిళ సినిమా 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) కు తెలుగు అనువాదం ఇది. ఈ నెల 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే... ''కొన్నిసార్లు నిజం చెప్పడం కథ అల్లడం కంటే కష్టం. ఇది ఒక నిజమైన మనిషి కథ'' అని నేపథ్యంలో మహిళ చెబుతుంటే, తెరపై శింబును గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేశారు గౌతమ్ మీనన్. తర్వాత ఒక పల్లె నుంచి పట్నం వచ్చిన యువకుడిగా హీరోను చూపించారు. అతడు గ్యాంగ్‌స్టర్ ఎలా అయ్యాడు? మాఫియాలోకి ఎలా వచ్చాడు? అతడి కథ ఏమిటి? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.
'ఎదుగుతున్న కొద్దీ ఎదురయ్యే ఒంటరి తనం... మనుషులు ఎవరూ ఉండని కొండ అంచున నిలబడినట్లు', 'ఆ దారిలో వేసే అడుగు నిప్పుతో చెలగాటం', 'ఏ గాలి ఎవరిని ఎటు తీసుకువెళుతుందో ఎవరికీ తెలియదు', 'నా తర్వాత నువ్వే నాయకుడివి అవుతావని ఆశపెడితే నన్ను చంపుతావా?' వంటి డైలాగులు బావున్నాయి.
'ప్రతి ఒక్కరిలో ఒకే వేదం... చంపు లేదంటే చావు' డైలాగ్ సినిమా థీమ్ చెప్పేలా ఉంది. రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ సినిమాలో ఫీల్ ఎలివేట్ చేసింది. శింబు, రాధిక, సిద్ధీ నటన ఆకట్టుకుంటోంది.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' తెలుగు ట్రైలర్ (The Life of Muthu Telugu Movie Trailer) ను ఇక్కడ చూడండి :
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. ఫస్ట్ పార్ట్‌ను 'ది లైఫ్ ఆఫ్ ముత్తు : కిల్లింగ్స్'గా విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఏఆర్ రెహమాన్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
'స్రవంతి' మూవీస్ అధినేత రవి కిశోర్ (Sravanthi Ravi Kishore) ఈ సినిమా గురించి మాట్లాడుతూ ''ట్రైలర్‌కు ఫెంటాస్టిక్ర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు కొత్తదనంతో కూడిన యాక్షన్ చిత్రమిది. శింబు నటన గురించి, దర్శకుడు గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళందరి బెస్ట్ వర్క్ ఈ సినిమా. సెప్టెంబర్ 17న తెలుగులో విడుదల చేస్తున్నాం. గతంలో 'స్రవంతి' సంస్థలో 'నాయకుడు', 'పుష్పక విమానం', ' రెండు తోకల పిట్ట', రఘువరన్ బీటెక్' చిత్రాలు అనువదించి విడుదల చేశాం. అవి సంచలన విజయాలు సాధించాయి. ఆ జాబితాలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కూడా చేరుతుందని ఆశిస్తున్నాం'' అని తెలిపారు.
Also Read : రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత హీరోయిన్‌గా నన్ను తీసేశారనుకున్నా - సిద్ధీ ఇద్నాని ఇంటర్వ్యూ
శింబు, గౌతమ్ మీనన్ కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. ఇంతకు ముందు 'ఏ మాయ చేసావె', 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ్ వెర్షన్స్ చేశారు. ఆ రెండూ రొమాంటిక్ ఫిల్మ్స్ అయితే... 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' యాక్షన్ సినిమా.
శింబు సరసన సిద్ధీ ఇద్నాని (Siddhi Idnani) కథానాయికగా నటించిన ఈ సినిమాలో హీరో తల్లి పాత్రను రాధికా శరత్ కుమార్ చేశారు. ఈ చిత్రానికి కథ: బి. జయమోహన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సిద్ధార్థ నూని, ఎడిటింగ్: ఆంథోనీ, పాటలు: అనంత్ శ్రీరామ్, కృష్ణ కాంత్, గానం: శ్రేయా ఘోషల్, చిన్మయి శ్రీపాద.
Also Read : కాషాయం జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?