Siddhi Idnani Interview : రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత హీరోయిన్‌గా నన్ను తీసేశారనుకున్నా - సిద్ధీ ఇద్నాని ఇంటర్వ్యూ
శింబు, గౌతమ్ మీనన్ కలయికలో రూపొందిన తాజా సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'. ఈ వారమే థియేటర్లలోకి వస్తోంది. రెండు రోజులు షూటింగ్ చేశాక... తనను సినిమా నుంచి తీసేశారని హీరోయిన్ సిద్ధీ ఇద్నాని అనుకున్నారట.
హీరోయిన్ సిద్ధీ ఇద్నాని (Siddhi Idnani) గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో ఛాన్స్ అందుకుంటారని, హీరోయిన్‌గా నటిస్తారని ఎవరూ అనుకోలేదు. తెలుగులో 'జంబ లకిడి పంబ', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి', 'ప్రేమ కథా చిత్రమ్ 2' చేశాక... ఆమె బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరో శింబు (Silambarasan TR - Simbu), దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'. తమిళ సినిమా 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) కు తెలుగు అనువాదం ఇది. ఇందులో సిద్ధీ ఇద్నాని హీరోయిన్. తమిళంలో ఈ నెల 15న... తెలుగులో 17న (ఈ శనివారమే) సినిమా విడుదల కానున్న సందర్భంగా సిద్ధీ ఇద్నాని మీడియాతో ముచ్చటించారు.
రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత తనను సినిమా నుంచి తొలగించి, మరొక అమ్మాయిని తీసుకున్నారని ఆవిడ అనుకున్నారట! ఎందుకు? ఏమైంది? అనే దాంతో పాటు సినిమా గురించి సిద్ధీ ఇద్నాని చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
ఉదయం ఆడిషన్... సాయంత్రం షూటింగ్!
''తెలుగులో నేను నటించిన సినిమాలు సరిగా ఆడలేదు. అప్పుడు బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి శింబు, గౌతమ్ మీనన్ సినిమా చేస్తున్నారని తెలుసు. అందులో కథానాయికగా నటించే అవకాశం అదృష్టవంతురాలు అనుకున్నా. నేనూ ప్రయత్నించా. ఒక రోజు ఆడిషన్‌కు పిలిచారు. ఉదయం నాలుగు గంటల ఫ్లైట్‌కు చెన్నై వెళ్లాను. ఆడిషన్ చేశారు. సాయంత్రం షూటింగ్‌కు రమ్మంటే వెళ్లాను. ఒక సీన్ చేశా. అప్పటికీ నమ్మకం కుదరలేదు. గౌతమ్ మీనన్ గారిని అడిగితే... 'నువ్వే హీరోయిన్' అన్నారు. అలా అనుకోకుండా ఆడిషన్, సినిమా షూటింగ్ ఒకే రోజు చేశా'' అని సిద్ధీ ఇద్నాని చెప్పారు.
కథానాయికగా కాదు... చిన్న రోల్ ఇచ్చినా చేసేదాన్ని!
''ఆడిషన్ చేసే సమయానికి నాకు కథ, క్యారెక్టర్, ఇతర వివరాలు ఏమీ తెలియదు. జస్ట్ శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ చేస్తున్నారని మాత్రమే తెలుసు. నాకు హీరోయిన్ రోల్ కాదు... జస్ట్ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేసేదాన్ని'' అని సిద్ధీ ఇద్నాని తెలిపారు. అఫ్ కోర్స్... కథానాయికగా సెలెక్ట్ చేసిన తర్వాత కథ, తన క్యారెక్టర్ గురించి గౌతమ్ మీనన్ పూర్తిగా వివరించారని ఆమె చెప్పుకొచ్చారు. వాళ్ళ ముగ్గురితో సినిమాలు చేయాలనుకునే కోరికలు ఒక్క సినిమాతో నెరవేరిందని సిద్ధీ చెప్పారు.
రెండు రోజులు షూటింగ్ చేశాక...
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' చిత్రీకరణలో సిద్ధీ ఇద్నాని జాయిన్ అయిన రెండు రోజులకు యూనిట్‌లో ఎవరికో బాలేకపోవడంతో షూట్ క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు తనను తీసేసి వేరే కథానాయికను ఎంపిక చేసుకుని ఉంటారని సిద్ధీ ఇద్నాని భావించారట. ఈ విషయం ఆమె చెప్పుకొచ్చారు. నేరుగా గౌతమ్ మీనన్‌కు ఫోన్ చేసి అడిగేసరికి... ''నువ్వే హీరోయిన్'' అని చెప్పడంతో ఆమె శాంతించారు. ఆ రెండు రోజులు అసలు షూటింగ్ చేసిన విషయం ఎవరికీ చెప్పలేదన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పారట.
ముత్తు జీవితంలో సంతోషమే పావని!
'ది లైఫ్ ఆఫ్ ముత్తు'లో హీరోయిన్ క్యారెక్టర్ పేరు పావని. ముత్తు జీవితంలో సంతోషమే ఆమె అని సిద్ధీ ఇద్నాని తెలిపారు. శింబు, గౌతమ్ మీనన్ కలయికలో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు రొమాంటిక్ ఫిల్మ్స్ అయితే... ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ఆవిడ చెప్పుకొచ్చారు. సినిమాలో సింగిల్ టేక్ సీన్స్ చాలా ఉన్నాయని, ప్రేక్షకులకు అవి కొత్త అనుభూతి ఇస్తాయని ఆమె తెలిపారు.
Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!
''ది లైఫ్ ఆఫ్ ముత్తు 'లో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఐదు పాటలకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇటీవల సినిమా చూశా. నేపథ్య సంగీతం ఇంకా బావుంది. సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది'' అని సిద్ధీ ఇద్నాని తెలిపారు.
నా స్నేహితులు పాటలు విని ఏడ్చేశారు!
''నా స్నేహితుల్లో కొంత మందికి తెలుగు, తమిళం రాదు. కానీ, వాళ్ళు ఈ సినిమా పాటలు విని కన్నీరు పెట్టుకున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పాటలు భాషలకు అతీతంగా చెరువు అవుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. అందులో వాల్‌పేపర్ నా ఫోటో ఉంది. అంత కంటే ఏం కావాలి? సినిమా విడుదల కోసం ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. కొంచెం నెర్వస్ కూడా ఉంది. అయితే... అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో... హ్యాపీ'' అని చెప్పారు.