Bollywood To Make Hindutva Movies : కాషాయం జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?
ఇప్పుడు బాలీవుడ్ ఏం చేస్తుంది? హిందుత్వ సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తుందా? హిందీ దర్శక - నిర్మాతలు, రచయితలు హిందూ దేవుళ్ళ పుస్తకాలు, పురాణాలు తిరగేస్తున్నారా? ట్రెండ్ చూస్తుంటే... ఆ విధంగానే ఉంది మరి!
హిందీ చలన చిత్ర పరిశ్రమలో కొన్ని నెలలుగా దారుణమైన పరిస్థితి నెలకొంది. అర కొర విజయాలు తప్ప... సరైన సూపర్ హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఇటువంటి తరుణంలో హిందీ చిత్రసీమకు 'బ్రహ్మాస్త్ర' విజయం (Brahmastra Success) ఊరట ఇచ్చింది. దాంతో బాలీవుడ్ హిందుత్వ సినిమాలపై దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. హిందీలో అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు, హీరోలు హిందూ దేవుళ్ళకు సంబంధించిన పుస్తకాలు, పురాణ ఇతిహాస గ్రంథాలను తిరగేయడం స్టార్ట్ చేసినట్లు ఉన్నారు.
హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడానికి కారణం ఏమిటి?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడానికి కారణం ఏమిటి? అని ఆలోచిస్తే... ముందు కనిపించే సమాధానం ఒక్కటే. దక్షిణాది సినిమా విజయాలు! 'బ్రహ్మస్త్ర' విడుదలకు ముందు వెళితే.... హిందీ అగ్ర హీరోలు అందరూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టడానికి అష్ట కష్టాలు పడ్డారు. కోట్లకు కోట్లు కొల్లగొట్టిన హీరోలు... లాభాల సంగతి దేవుడు ఎరుగు, నష్టాల నుంచి సినిమాలను గట్టెక్కించలేక విమర్శలు మూట గట్టుకున్నారు. నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా చాప కింద నీరులా ఉత్తరాది అంతటా ప్రవహించి కోట్లకు కోట్లు వసూళ్లు సాధించిన చోట... ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' చతికిలపడింది.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసిన నార్త్ ఇండియన్స్... రణ్‌వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాలను ఫ్లాప్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' పతాక సన్నివేశాల్లో రామ్ చరణ్‌ను చూసిన ఉత్తరాది ప్రేక్షకులు 'జై శ్రీరామ్' అంటూ థియేటర్ల దగ్గర నినాదాలు చేశారు. 'రన్ వే 34'తో థియేటర్లలో నిరాశ చెందిన అజయ్ దేవగణ్ అంతకు ముందు హిట్ అందుకున్నది 'తానాజీ'తో! అందులో హిందూ దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పే సన్నివేశాలు ఉన్నాయి. 'కెజియఫ్ 2'లో మహిళలను అమ్మవారితో పోల్చే సన్నివేశం ఉంది. హిందీ సినిమా ప్రముఖులు వీటన్నిటినీ నిశితంగా గమనించారు.
ఈ ఏడాది 'షంషేరా'తో భారీ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న రణ్‌బీర్ కపూర్, లేటెస్టుగా 'బ్రహ్మాస్త్ర'తో హిట్ అందుకున్నారు. ఇందులో ఉన్నది ఏమిటి? హిందుత్వమే కదా! అందుకని, భారతీయ పురాణ ఇతిహాస గ్రంథాలపై బాలీవుడ్ పడినట్లు కనబడుతోంది.
మహాభారతం... మొదటి ఆప్షన్!
ఇప్పుడు బాలీవుడ్ ముందున్న మొదటి హిందుత్వ ఆప్షన్... మహాభారతం! ఈ ఇతిహాసాన్ని ఇండియన్ స్క్రీన్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టారు. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ చిత్రాలు నిర్మిస్తున్న రామ్ గోపాల్ వర్మ బంధువు మధు మంతెన కలిసి వెండితెరపైకి మహాభారతాన్ని తీసుకు రావాలనుకున్నారు. అదీ ఇప్పటి మాట కాదు... మూడు నాలుగేళ్ల క్రితమే! లేటెస్టుగా ఆ మహాభారతం ప్రకటన వచ్చింది. కాకపోతే థియేటర్ల కోసం కాదు... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం చేస్తున్నట్లు తెలిపారు.
అల్లు అరవింద్, మధు మంతెనల మహా భారతాన్ని పక్కన పెడితే... అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవగణ్‌లతో సుమారు 700 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మాత ఫిరోజ్ నడియాడ్‌వాలా మహాభారతం ఆధారంగా మరో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. 2025లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కావచ్చని టాక్.
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ
హిందీ సినిమాల్లో మోడ్రన్ కల్చర్ పేరిట హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారని, హిందూ దేవతామూర్తులు - దేవుళ్ళకు అవమానం జరుగుతోందని కొన్ని ఏళ్లుగా ఒక వర్గం ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ సినిమాలు చేయడం ద్వారా వాళ్ళను ఆకట్టుకోవడంతో పాటు విజయాలు అందుకోవచ్చనేది బాలీవుడ్ ప్లాన్‌గా తెలుస్తోంది.
రామాయణం... రెండో ఆప్షన్!
మహాభారతం తర్వాత బాలీవుడ్ ముందున్న రెండో ఆప్షన్... రామాయణం! ఆల్రెడీ ప్రభాస్ కథానాయకుడిగా 'ఆదిపురుష్' రూపొందింది. యంగ్ రెబల్ స్టార్ తెలుగు వాడు అయినప్పటికీ... ఆ సినిమాకు పని చేసిన బృందమంతా బాలీవుడ్డే. అక్షయ్ కుమార్ 'రామసేతు' అని ఒక హిందీ సినిమా చేశారు. సీతమ్మ కోసం బయలుదేరిన రాముడు లంక చేరుకోవడం కోసం వానర సైన్యం అంతా కలిసి రామసేతు వారధి నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమాలో దాని గొప్పదనం గురించి అక్షయ్ సినిమాలో వివరిస్తున్నారని వినికిడి. రామాయణం మీద రెండు సినిమాలు రావడంతో రెండో ఆప్షన్ అయ్యింది.
త్వరలో 'బ్రహ్మాస్త్ర 2' షురూ!
'బ్రహ్మాస్త్ర' విడుదలకు ముందు సినిమాను మూడు భాగాలుగా తీయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. తొలి రోజు సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ... వసూళ్ల పరంగా సినిమా భారీ విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 'బ్రహ్మస్త్ర 2' స్టార్ట్ చేయడానికి రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్ రెడీ అవుతున్నారు.
'బ్రహ్మాస్త్ర' విజయంతో హిందీ దర్శక నిర్మాతలు హిందూ పురాణాలను ఏ విధంగా తెరపైకి తీసుకు రావచ్చని ఆలోచిస్తున్నారట. కొత్త కోణంలో రామాయణ, మహాభారతాలను వెండితెరపై తీసుకువచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం!
Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?