Telugu Film Producers Council: అడ్డగోలు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవు, మీడియాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సీరియస్ వార్నింగ్
Film Producers Council: సంక్రాంతి సినిమా విడుదల వివాదాలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మరోసారి వివరణ ఇచ్చారు. ఎదుటి వారి పరువుకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Telugu Film Producers Council Explanation: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలితో పాటు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా వివరణ ఇచ్చాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. కావాలని కొన్ని వెబ్ సైట్లు, మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఏ సినిమాకు అన్యాయం జరగకూడదని నిర్ణయించాం
“సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు థియేటర్ల వివాదాల పైన తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టాయి. సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లను పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరడం జరిగింది. ‘హనుమాన్’, ‘ఈగల్’, ‘సైంధవ్’, ‘గుంటూరు కారం’, ‘నా సామిరంగ’ పండగ బరిలో నిలిచాయి. మా రిక్వెస్ట్ ను మన్నించి సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్’ సినిమాను ఫిబ్రవరి 9కి మార్చారు.
ఒక మాస్ హీరో డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ వెనక్కి తగ్గడం అనేది ఆషామాషీ విషయం కాదు. అటు సంక్రాంతి బరి నుంచి రజనీకాంత్, ధనుష్ సినిమాలు వాయిదా వేసుకున్నారు. శివ కార్తికేయన్ తమిళ్ సినిమా కూడ రిలీజ్ కి ఉండగా ఆ ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి సినిమాని 19 కి వాయిదా వేయించడం జరిగింది. సంక్రాంతి అంటే ఒక మంచి పోటీ సినిమాల మధ్య హెల్తీ వాతావరణం లో ఉంటుంది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి ప్రొడ్యూసర్ కి దర్శకుడుకి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపిస్తున్నాం” అని వెల్లడించాయి.
తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవు!
సినిమా పరిశ్రమపై కొన్ని వెబ్ సైట్లు, మీడియా సంస్థలు అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నాయని సదరు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. “కొన్ని వెబ్ సైట్స్, ఇతర మీడియా సంస్థలు కావాలనే సంక్రాంతి టైంలో వాళ్ల రేటింగ్స్, టిఆర్పీల కోసం అబద్దపు రాతలు, ఆర్టికల్స్ రాస్తూ సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య హీరోల మధ్య ప్రొడ్యూసర్ల మధ్య దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆర్టికల్స్ రాసే ముందు మా ఆర్గనైజేషన్స్ ని సంప్రదించి నిజాన్ని తెలుసుకుని వార్తలని ప్రచురించాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పాలనుకున్న వార్తలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, అబద్ధపు వార్తలు, ఇబ్బంది పెట్టే వార్తలు రాస్తూ ఎదుటివారి మనోభావాలను, ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. ఎవరన్నా ఆర్టిస్టులు గాని ప్రొడ్యూసర్లు గాని దర్శకులు కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలను పూర్తిగా వినకుండా తాత్పర్యాన్ని అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో పరిశ్రమని ఇబ్బంది పడే విధంగా ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు. ఇకనుంచి సోషల్ మీడియా, ఇతర మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టే రాతలు రాస్తే మటుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అని హెచ్చరించాయి.
Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం