Asin Thottumkal: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం
Asin Thottumkal: ఆమె ఓ కేరళ బ్యూటీ. బాలీవుడ్ స్టార్స్ తో కలిసి చేసిన సినిమాలు వందల కోట్లు వసూళు చేశాయి. కెరీర్ పీక్ లో ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే?
సినిమా పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కొంత మంది వందల సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాదు. మరికొంత మంది కొన్ని సినిమాలు చేసినా బాగా పాపులర్ అవుతారు. ఇంకొంత మంది కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరమైన వాళ్లూ ఉంటారు. అలాంటి వారిలో ఒక హీరోయిన్, బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి రూ.100 కోట్ల హిట్స్ అందుకుంది. పెళ్లి కోసం ఏకంగా సినిమాల నుంచే తప్పుకుంది. ఆమె మరెవరో కాదు కేరళ బ్యూటీ అసిన్.
15 ఏండ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ
కేరళలోని కొచ్చిలో జన్మించిన అసిన్, 2001లో సత్యన్ అంతిక్కడ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకా’ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. ఆ తర్వాత రవితేజతో కలిసి ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో ఆమె తమిళ అమ్మాయిగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘గజిని’, ‘శివకాశి’, ‘వరలారు’, ‘పోక్కిరి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అసిన్, ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సౌత్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న ‘గజిని’ రీమేక్ లో అమీర్ ఖాన్ తో కలిసి నటించింది. ఈ చిత్రం బాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూళు చేసింది. 2008లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో కలిసి ‘రెడీ’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల వారెవ్వా అన్నారు. ఈ చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో కలిసి ‘హౌస్‌ఫుల్ 2’లో నటించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా కూడా రూ.100 కోట్లకు పైగా సంపాదించింది. అటు అక్షయ్‌తో కలిసి ‘ఖిలాడీ 786’లోనూ నటించి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో వివాహం
కెరీర్ పీక్స్ లో ఉండగానే అసిన్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. 2016లో మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. రాహుల్ శర్మకు చెందిన మైక్రో మ్యాక్స్ సంస్థ తక్కువ ధర కలిగిన ఫీచర్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఎదిగింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2017లో రూ.1300 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నాడు.
అసిన్‌కు, రాహుల్‌ను పరిచయం చేసిన అక్షయ్
నిజానికి అసిన్, రాహుల్ శర్మ మధ్య ప్రేమకు కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అసిన్ తో కలిసి సినిమా చేస్తున్న సమయంలో అక్షయ్.. రాహుల్ ను పరిచయం చేశారు. ఆ తర్వాతే రాహుల్ మైక్రోమ్యాక్స్ అధినేత అని అసిన్‌కు తెలిసింది. పెద్ద వ్యాపారవేత్త అయినా ఆయనలోని అణకువ తనకు బాగా నచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2017లో ఈ దంపతులకు పాప పుట్టింది. ఆమెకు అరిన్ అనే పేరు పెట్టారు. సోషల్ మీడియాలో తరచుగా తన పాప ఫోటోలను షేర్ చేస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆసిన్ కూడా భర్త వ్యాపార లావాదేవీలన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. మొదటి నుంచి అసిన్‌కు బిజినెస్‌పై ఆసక్తి ఎక్కువ సినిమాల్లో ఉన్నప్పుడు కూడా స్వయంగా పలు వ్యాపారాలు చేసేది. రీఎంట్రీ కోసం అవకాశాలు వస్తున్నా.. అసిన్ సున్నితంగా తిరస్కరిస్తోందట.
Read Also: రౌడీ బాయ్, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ - ఇదీ అసలు విషయం!