తెలుగు సినిమాలు అడ్డుకుంటాం - తమిళ నిర్మాతలు వార్నింగ్, స్పందించిన అల్లు అరవింద్
పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దంటూ తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం.. తమిళ ప్రొడ్యూసర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.
2023 సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాలేవీ విడుదల చేయకూడదంటూ టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రకటనపై తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ హీరో విజయ్‌తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. 2017లో జరిగిన సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు కేవలం స్ట్రయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, 2023లోనూ అది పాటించాలని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తమిళ నిర్మాతలకు ఆగ్రహం కలిగించింది. మేము కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామని దర్శకుడు సిమాన్ చేసిన కామెంట్లు మన నిర్మాతలను ఆలోచనలో పడేశాయి.
తెలుగు సినిమాలు.. తమిళనాడులో ఎలాంటి ఆటంకం లేకుండా విడుదల అవుతున్నప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని ప్రశ్నించారు. తమ చిత్రాలను అడ్డుకుంటే తమిళనాడులో తెలుగు చిత్రాలను కూడా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఈ నెల 22న తమిళ నిర్మాతలు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ప్రకటనలపై స్పందించకుండా సౌత్ ఇండియన్ చాంబర్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ వివాదంపై అల్లు అరవింద్ కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ చిత్రాలను ఆపడం జరిగే పని కాదన్నారు.
‘తోడేలు’ (బేడియా) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. డబ్బింగ్ చిత్రాల రిలీజ్ వివాదంపై మాట్లాడారు. ‘‘మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు సినిమా ‘బాహుబలి’ ఎల్లలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఆడింది. సినిమాలకు ఇప్పుడు ఎల్లలు లేవు. సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుంది. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమ అందరిది. అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు సినిమాకి సౌత్, నార్త్ అనే తేడాలేదు. ఇక్కడ బాగున్న సినిమా అక్కడ ఆడుతుంది. అక్కడ బాగున్న సినిమా ఇక్కడ ఆడుతుంది’’ అని పేర్కొన్నారు.
టార్గెట్ దిల్ రాజు?
దిల్ రాజును టార్గెట్ చేసుకొనే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఆగస్టు నెలలో టాలీవుడ్‌లో తెలుగు సినిమాల షూటింగ్ నిలిపివేసిన సమయంలో దిల్ రాజు ‘వారసుడు’ మూవీ షూటింగ్ నిలిపివేయాలేదు. ఇది స్ట్రైట్ తమిళ చిత్రం అంటూ కొనసాగించారు. అయితే, ఈ చిత్రాన్ని ప్రకటించిన మొదట్లో ‘వారిసు’(తమిళం) ద్విభాష చిత్రమని ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి దిల్ రాజ్‌ను టార్గెట్ చేసుకుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘వారసుడు’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమిళ సినిమా ‘వారిసు’ను తెలుగులో ‘వారసుడు’ పేరుతో డబ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, దిల్ రాజు దీనిపై స్పందించలేదు. అయితే, గతంలో దిల్ రాజు స్వయంగా సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల విడుదలపై ఇలాంటి ప్రకటనే చేశారు. పండుగల సమయంలో స్ట్రయిట్ సినిమాలకు ప్రాధాన్యమిచ్చి, మిగిలిన థియేటర్లకు మాత్రమే డబ్బింగ్ సినిమాలను కేటాయించాలని 2019లో పేర్కొన్నారు. మరి, తెలుగు నిర్మాతల మండలి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.