Project K Update: హాలీవుడ్ స్టూడియోలతో ‘ప్రాజెక్ట్ K’ VFX వర్క్, కీలక విషయాలు వెల్లడించిన స్వప్నాదత్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అందించింది స్వప్నాదత్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కీలక విషయాలు వెల్లడించిన స్వప్నా దత్
‘ప్రాజెక్ట్ K’ సినిమా శరవేగంగా నిర్మాణం అవుతోందని స్వప్నాదత్ తెలిపారు. “ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్స్ చేస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ K’ ఎక్కువగా గ్రాఫిక్స్ తో కూడుకుని ఉంటుంది. అందుకే, సినిమా దాదాపు 70% చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ, VFX వర్క్ కు చాలా సమయం పడుతుంది. సినిమా షూటింగ్ తో పోల్చితే గ్రాఫిక్స్ పనులకే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది” అని తెలిపింది. ఇంతకీ ‘ప్రాజెక్ట్ K’ అనేది వర్కింగ్ టైటిలా? అసలు పేరా? అనే ప్రశ్నకు స్వప్న సమాధానం దాటవేసింది. అవసరం అయినప్పుడు అన్ని విషయాలు చెప్తామ వెల్లడించింది.
విష్ణువు మోడరన్ అవతార్- అశ్వినీ దత్
‘ప్రాజెక్ట్ K’ సినిమా జానర్ గురించి నిర్మాత అశ్వీని దత్ ఇప్పటికే పలు విషయాలు వెల్లడించారు. “ఈ చిత్రంలో ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది విష్ణువు యొక్క మోడరన్ అవతారం గురించి ఉంటుంది. కానీ అదే సమయంలో, సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లను పర్యవేక్షించడానికి నలుగురైదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ లను తీసుకొచ్చాం. సినిమాలో మీరు చూసే ప్రతి ఒక్కటీ ఆశ్చర్యపరుస్తుంది” అని చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది జనవరి 12న ‘ప్రాజెక్ట్ K’ విడుదల
‘ప్రాజెక్ట్ K’ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనే కాకుండా, పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అశ్వినీ దత్ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ తో రూపొందించబడిన చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ చిత్రానికి డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
‘ప్రాజెక్ట్ K’ కంటే ముందు, ప్రభాస్ ‘ఆది పురుష్’, ‘సలార్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘ఆది పురుష్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అటు ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. మారుతీ డైరెక్షన్ లోనూ ‘రాజా డీలక్స్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Read Also: ‘రామబాణం‘ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ, అక్కడైనా ప్రేక్షకులను ఆకట్టుకునేనా?