Rajinikanth First Love: రజనీకాంత్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ తెలుసా? - ఇప్పటికీ ఆ అమ్మాయిని చూడటం కోసం ఎదురుచూపులు!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి తెలుసా?
రజనీకాంత్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక సూపర్ స్టార్. ఎంతమంది ఎదురొచ్చినా షర్టు చిరగకుండా, క్రాఫు చెరగకుండా కొట్టగల సూపర్ హీరో. స్క్రీన్‌పై ఎంత అందమైన అమ్మాయి అయినా తలైవర్ వెనక పడాల్సిందే. దేశం మొత్తాన్ని తన జపంలో ముంచేయగల రజనీకాంత్ నిజజీవితంలో భగ్న ప్రేమికుడన్న సంగతి మీకు తెలుసా? ప్రేమించిన అమ్మాయిని మరొక్కసారి చూడాలనే ఆశతో ఇప్పటికీ తపిస్తున్నాడని ఊహించగలరా? రజనీని సూపర్ స్టార్ అవ్వడానికి ప్రేరేపించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
రజనీకాంత్ బస్ కండక్టర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేసే రోజుల్లో ఎంబీబీఎస్ చదివే ఒకమ్మాయి తరచుగా తలైవర్ డ్యూటీ చేసే బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణం చేసేది. వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ సమయంలోనే తను నటించే ఒక నాటకానికి ఆ అమ్మాయిని రజనీ ఆహ్వానించాడు.
అనంతరం కొన్ని రోజులకు రజనీకి చెన్నైలోని అడయార్ ఇన్‌స్టిట్యూట్‌కు రావాల్సిందిగా ఒక లెటర్ వచ్చింది. తనకు తెలియకుండా ఎవరు అప్లై చేశారో రజనీకి తెలియలేదు. ఇంతలో ఆ అమ్మాయి లెటర్ వచ్చిందా అని రజనీని అడిగిందట. నువ్వే అప్లై చేశావా అని రజనీ ఆ అమ్మాయిని అడిగితే అవునని చెప్పిందట.
దీంతో రజనీ కాసేపు ఆలోచించి ‘వెళ్లవచ్చు. కానీ అక్కడ ఉండటానికి, ఖర్చులకి చాలా డబ్బులు అవసరం అవుతాయి. అంత డబ్బులు నా దగ్గర లేవు.’ అన్నారట. వెంటనే ఆ అమ్మాయి అప్పటికప్పుడు రూ.500 ఇచ్చి ‘నీకు ఉన్న టాలెంట్‌కి నువ్వు నటనలో ఎంతో ఎత్తుకు ఎదగగలవు. ప్రపంచంలోనే గొప్ప నటుడివయ్యే సత్తా నీలో ఉంది. నీ పోస్టర్లు, కటౌట్లను నేను ఇక్కడ చూడాలి. నువ్వు కచ్చితంగా వెళ్లాల్సిందే.’ అని పట్టుబట్టి పంపిందట.
రజనీకాంత్ చెన్నై వచ్చాక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాక వెంటనే జాయిన్ అవ్వమని అడిగారట. అక్కడ జాయిన్ అయ్యాక తర్వాతి ఆదివారం రజనీకాంత్ ఆ అమ్మాయిని చూడటానికి బెంగళూరు వచ్చారు. కానీ ఆరోజు ఆ అమ్మాయి బస్ ఎక్కలేదు. తర్వాతి రోజు కూడా వచ్చి వెయిట్ చేసినా ఆ అమ్మాయి కనిపించలేదు. దీంతో కొంతమంది ఫ్రెండ్స్‌ని వెంటబెట్టుకుని బెంగళూరులో ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించి ఇంటికి వెళ్లగా తాళం వేసి కనిపించింది. పక్కింటి వాళ్లని అడిగితే వారం క్రితమే ఆ అమ్మాయి ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పారట. అప్పటి నుంచి ఇప్పటివరకు రజనీకాంత్‌కి ఆ అమ్మాయి కనిపించలేదట.
కానీ ఆ అమ్మాయి చెప్పినట్లే రజనీ దేశం గర్వపడే హీరో అయ్యారు. అంత పెద్ద హీరో అయినప్పటికీ ఆ అమ్మాయి రజనీని వెతుక్కుంటూ రాలేదట. అది రజనీకి మరింత బాధను కలిగించిందట. ఇప్పటికీ రజనీ ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఆయన కళ్లు ఆ అమ్మాయి కోసం వెతుకుతాయని ఆయనే స్వయంగా చెప్పారట. తన స్టార్‌డం కంటే ఆవిడ మంచితనం గొప్పదని తలైవర్ చాలా సందర్భాల్లో అన్నారట. తాను సూపర్ స్టార్ దాని కోసం ఆ అమ్మాయి తన దగ్గరకు రాలేదని, ఆ అమ్మాయి గొప్పతనం అదేనని రజనీ చెప్పారట.
ఈ విషయాలన్నీ ప్రముఖ మలయాళ నటుడు దేవన్ శ్రీనివాసన్ వెల్లడించారు. బాషా సినిమాలో నగ్మా తండ్రిగా కనిపించింది ఈయనే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దేవన్‌కు రజనీ తన కథను చెప్పారట. మొత్తం చెప్పాక రజనీ విపరీతంగా ఎమోషనల్ అయ్యారని దేవన్ చెప్పారు. ‘సార్. ఆవిడ ఏదో ఒకరోజు మీకు కనిపిస్తుంది.’ అని రజనీతో దేవన్ అన్నారట. అప్పుడు రజనీ ‘కచ్చితంగా వస్తుందంటావా?’ అని ఎక్సైట్‌మెంట్‌తో అన్నారట. తాను విన్న, చూసిన ప్రేమకథల్లో ఇదే అత్యంత గొప్పదని దేవన్ అన్నారు. మరి మీరేం అనుకుంటున్నారు? రజనీ తాను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని మళ్లీ చూడగలరా?