SS Rajamouli: రాజమౌళి టూర్ల వెనుక అసలు కథ అదేనా? ఆ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లేనా?
రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న తాజా చిత్రం SSMB29. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యే అవకాశం ఉంది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. దాదాపు ఈ సినిమా కథ రెడీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు జక్కన్న టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలకు వెళ్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత ప్యారిస్ లో VFX-పరిశోధన యాత్ర చేపట్టారు. తాజాగా కుటుంబంతో కలిసి నార్వే టూర్ కు వెళ్లారు. ప్రఖ్యాత పల్పిట్ రాక్స్ ను సందర్శించారు.
SSMB29 లొకేషన్స్ కోసమే జక్కన్న టూర్లు!
రాజమౌళి రీసెంట్ టూర్లు అన్నీ మహేష్ బాబుతో సినిమా కోసమేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఓవైపు తన తండ్రి స్టోరీ రెడీ చేస్తుండగానే, మరోవైపు ఆయన లొకేషన్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఆలయాలపైనా, ఫారిన్ టూర్ అయినా, నార్వే పల్పిట్ రాక్స్ సందర్శన అయినా, మొత్తం SSMB29 కోసమేనని జక్కన్న సన్నిహితులు చెప్తున్నారట. ఆయన వెళ్లిన ప్రతి చోట తన లేటెస్ట్ మూవీ షూటింగ్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఓవైపు ఈ టూర్ల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు కొత్త ఆలోచనతో సినిమా స్క్రిప్ట్ విషయంలో పలు సూచనలు చేస్తున్నారట.
‘ఇండియానా జోన్స్’ తరహా అడ్వెంచరస్ మూవీ
వాస్తవానికి ఈ సినిమా కథ కోసం కొద్ది నెలలుగా వర్కౌట్ నడుస్తోంది. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ మూవీగా ఉండబోతోందని దర్శకుడు రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. ఇదే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం ధృవీకరించారు. మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండియానా జోన్స్ తో పాటు 1981లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకున్న ‘రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ సినిమా లక్షణాలు కూడా ఉండబోతున్నాయట. ఈ అడ్వెంచరస్ చిత్రాన్ని హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ రూపొందించారు. SSMB29కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే కంప్లీట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాలో కావాల్సినంత థ్రిల్, అంతకు మించి ఎమోషన్ ఉంటుందన్నారు.
గ్లోబల్ ట్రాటింగ్ ఎక్స్ ప్లోరర్ గా మహేష్ బాబు!
అటు ఈ సినిమా క్లైమాక్స్ గురించి కూడా విజయేంద్ర ప్రసాద్ కీలక విషయాలు తెలిపారు. క్లైమాక్స్ లో కథ ఎండ్ చేయకుండా, వదిలేస్తున్నట్లు తెలిపారు. అలా వదిలేయడం వల్ల సీక్వెల్ కు ఉపయోగపడుతుందన్నారు. అంటే కచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 సమ్మర్ నుంచి నుంచి షురూ కావచ్చని తెలుస్తోంది. ఈ చిత్రంలో విలువైన వస్తువుల అన్వేషణలో భాగంగా మహేష్ బాబు గ్లోబల్ ట్రాటింగ్ ఎక్స్ ప్లోరర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇండియానా జోన్స్ సిరీస్ ఛాయలతో పాటు భారతీయ సంస్కృతి, పురాణాలు, చరిత్రలో లోతుగా పాతుకుపోయిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. తొలిభాగం భారత్, ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
Read Also: అమెరికా బాట పట్టిన సమంత, మళ్లీ తిరిగి వచ్చేది అప్పుడేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial