SS Rajamouli: హృతిక్ పై పొరపాటుగా ఆ కామెంట్స్ చేశాను, పాత వివాదంపై జక్కన్న వివరణ!
హృతిక్ రోషన్ పై రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో జక్కన్న వివరణ ఇచ్చారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు.
‘RRR’ మూవీతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, గతంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మీద చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్’ అంటూ అప్పల్లో వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజమౌళి వివరణ ఇచ్చారు. పొరపాటుగా అలా మాట్లాడానే తప్ప, హృతిక్ ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు.
పొరపాటుగా అలా మాట్లాడాను- రాజమౌళి
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల వేడుకలో పాల్గొన్న రాజమౌళి, తాను గతంలో చేసిన కామెంట్స్ పై స్పందించారు. “ఈ వ్యాఖ్యలు నేను చాలా కాలం కిందట చేశాను. 15-16 సంవత్సరాల కిందట ఆ కామెంట్స్ చేశా అనుకుంటున్నాను. అప్పట్లో ఏదో పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నాను. హృతిక్ రోషన్ ను కించపరిచే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. నేను అతడిని చాలా గౌరవిస్తాను. గతంలో చేసిన కామెంట్లపై కాస్త ఫీలవుతున్నాను” అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు.
రాజమౌళి వివరణపై అభిమానుల ప్రశంసలు
రాజమౌళి వివరణ పట్ల హృతిక్ రోషన్ అభిమానులతో పాటు ఆయన అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటును అంగీకరించడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జక్కన్నను అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. "అతడు జరిగిన పొరపాటును అంగీకరించడంతో పాటు సూటిగా సమాధానం చెప్పడం నచ్చింది. చాలా మంది వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఆయన తన తప్పును అంగీరించారు. అది అతడిలోని గొప్పదనం” అంటూ ప్రశంసిస్తున్నారు
ఇంతకీ రాజమౌళి హృతిక్ గురించి ఏమన్నారంటే?
“రెండేళ్ల క్రితం ధూమ్ 2 విడుదలైనప్పుడు, బాలీవుడ్ మాత్రమే ఇంత నాణ్యమైన చిత్రాలను ఎందుకు చేయగలదని నేను ఆశ్చర్యపోయాను. హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? అనుకున్నాను. ఇప్పుడే బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశాను, ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజమౌళిపై హృతిక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దుమ్మెత్తి పోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
అటు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డుల వేదికలపై సత్తా చాటుతోంది. తాజాగా ఈ ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ అవార్డును తీసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ‘RRR’ టీమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల సంబురాలు చేసుకున్నారు. అటు ఆస్కార్ అవార్డు కోసం ఈ పాట పోటీ పడుతుంది. అటు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలోనూ షార్ట్ లిస్ట్ అయ్యింది. ఆస్కార్స్ లోనూ ‘RRR’ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: 'RRR’ బాలీవుడ్ మూవీ కాదు, అసలు విషయం చెప్పిన దర్శకుడు రాజమౌళి!