800 Motion Poster: క్రికెటర్ ముత్తయ్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘800‘ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కు అదిరిపో బర్త్ డే గిఫ్ట్ అందింది. 51వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన బయోపిక్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది.
సినిమా పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. క్రీడా రంగంలో రాణించిన పలువురు దిగ్గజాల కథలను వెండితెరపై చూపించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భారతీయ క్రికెటర్లలో పలువురు ప్రముఖుల కథలు తెరకెక్కాయి. అజారుద్దీన్ మొదలుకొని సచిన్, ధోనీ బయోపిక్స్ రూపొందాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరపై కనిపించబోతోంది. ‘800’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టెస్టు క్రికెట్ లో ఆయన తీసిన వరల్డ్ రికార్డు 800 వికెట్లకు గుర్తుగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు.
ముత్తయ్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
ఈ చిత్రానికి MS శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో నటించి ప్రశంసలు దక్కించుకున్న మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో ముత్తయ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇవాళ ముత్తయ్య మురళీధరన్ 50 ఏళ్లు పూర్తి చేసుకుని 51వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు మంచి బహుమతి అందించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.
MUTHIAH MURALIDARAN BIOPIC: FIRST LOOK POSTER… WILL RELEASE IN 3 LANGUAGES... #MadhurrMittal - who won acclaim for his performance in the #Oscar-winning film #SlumdogMillionaire - will play legendary cricketer #MuthiahMuralidaran in his biopic, titled 800 [#800TheMovie].
— taran adarsh (@taran_adarsh) April 17, 2023
Motion… pic.twitter.com/zCvfDHXJ0R
విజయ్ సేతుపతి కాదు, మధుర్ మిట్టల్
నిజానికి ఈ సినిమాలో ముత్తయ్య క్యారెక్టర్ కోసం గతంలో విజయ్ సేతుపతిని హీరోగా అనుకున్నారు. అప్పట్లో మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ప్రస్తుతం ఈ చిత్రంలో మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియాలో చిత్రీకరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు
ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1,374 వికెట్లు, లిస్టు ఏ క్రికెట్‌లో 682 వికెట్లు పడగొట్టారు. ఐసీసీ హాల్ ఆఫ్ క్రికెటర్స్ లో స్థానం పొందారు.
భారత్ లో ముత్తయ్య మూలాలు
ఇక ముత్తయ్య మురళీధరన్ పూర్వీకుల మూలాలు భారత్ లోని తమిళనాడులో ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం భారత్ నుంచి శ్రీలంకు వెళ్లిపోయారు. ముత్తయ్య చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు. అయినా, తమిళనాడుపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. అంతేకాదు, తను తమిళ అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. ఈయన క్రికెట్ జీవితంలోనే కాకుండా వ్యక్తి జీవితంలోనూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన కుటుంబలో చాలా విషాద ఘటనలు జరిగాయి. వాటన్నింటీని దర్శకుడు ఈ చిత్రంలో చూపించనున్నారు.
Read Also: బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన ‘శాకుంతలం’ - మరీ ఇంత తక్కువ?