(Source: ECI/ABP News/ABP Majha)
Varisu Run time: ‘అవతార్-2’తో పోటీపడుతున్న ‘వారసుడు’ - ఇదేంటీ, ఇంత ఉంది?
తమిళ నటుడు విజయ్ సినిమా ‘వారసుడు’ మూవీకు సెన్సార్ పూర్తి అయింది. అయితే ఈ మూవీ రన్ టైమ్ చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరీ ఇంత లాంగ్ అయితే ఎలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకడు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. తెలుగులో కూడా విజయ్ కు మంచి పాపులారిటీ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఈ సారి ఆయన నటించిన ‘వారిసు’ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మూవీని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా విజయ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ‘వారసుడు’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. సర్టిఫికేట్ లో సినిమా రన్ టైమ్ 2.50 గంటలు నిడివి అని ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత రన్ తో ఉన్న సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. గతంలో వచ్చిన విజయ్ ‘మాస్టర్’ సినిమా కూడా లాంగ్ రన్ టైమ్ తో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లే అంటున్నారు సినీ క్రిటిక్స్. ఈ మధ్య లాంగ్ రన్ టైమ్ తో వచ్చిన సినిమాలు నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చుకున్నాయి. అందులోనూ ఓటీటీ లు వచ్చిన తర్వాత ప్రేక్షకులు సినిమా మంచి టాక్ తెచ్చుకుంటేనే థియేటర్లకు వస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలను కూడా ఓటీటీల్లోనే చూడటానికి రెడీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘అవతార్-2’ రన్‌టైమ్ 3.12 గంటలు. అంటే రెండు సినిమాలకు మధ్య తేడా సుమారు 20 నిమిషాలు. అయితే, ‘అవతార్-2’ వంటి అద్భుతాన్ని చూసేందుకే ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. మరి, ‘వారసుడు’ను అంత సేపు ఓపిగ్గా చూడగలరా అనే సందేహాలు నెలకొన్నాయి.
తమిళ హీరో విజయ్ సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తాయి. అది తమిళ్ వరకూ ఓకే.. అదే తెలుగులోకి వచ్చేసరికి ఇతర భాషల్లో హీరోల సినిమాలు బాగుంటేనే చూడటానికి వస్తారు. రిలీజ్ సమయంలో థియేటర్లకు వచ్చినా తర్వాత సినిమా టాక్ ను బట్టే ఇక్కడ ఆ సినిమాలు ఆడతాయి. ఇక ‘వారసుడు’ సినిమా విషయానికొస్తే వంశీ పైడిపల్లి ప్రధానంగా ఎమోషన్స్ పైనే సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. గతంలో వచ్చిన ‘బృందావనం’, ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి సినిమాలు అలాంటి కథలే. ఈ సినిమాను కూడా అదే కోవలో తీశారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే ఇలాంటి కథ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం గురి తప్పినా చేదు అనుభవాలే ఎదురవుతాయి. అయితే ఈ సినిమా తమిళంలో ప్రేక్షకులకు కొత్తగా అనిపించినా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించడం కష్టమే. స్టాంగ్ స్టోరీ, టైట్ స్క్రీన్ ప్లే ఉంటేనే ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి ఈ సినిమా ఎక్కడ ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.