Boycott bollywood: ‘పఠాన్’కు పాట్లు - బాయ్‌కాట్‌పై బాలీవుడ్ కలవరం, కేంద్రాన్ని ఆశ్రయించిన సినీ పెద్దలు
గత కొంతకాలంగా కొనసాగుతున్న‘బాలీవుడ్ బాయ్ కాట్’ రచ్చపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని FWICE కోరింది. లేదంటే, సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో బాయ్ కాట్ ఆందోళన మొదలయ్యింది. అప్పటి నుంచి ప్రతిష్టాత్మక బాలీవుడ్ సినిమాలు సైతం ఈ ప్రచారంతో ఘోరంగా విఫలం అవుతున్నాయి. ‘లాల్ సింగ్ చద్దా’ లాంటి సినిమాలు ప్రేక్షకులు లేక షోలకు షోలే క్యాన్సిల్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా, డిజాస్టర్ గా మిగలడంతో అమీర్ ఖాన్ ఏకంగా సినిమాలకే విరామం ప్రకటించారు. ప్రస్తుతం బాయ్ కాట్ సెగ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’కు తగిలింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రంగంలోకి దిగింది. హిందీ సినిమాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బాయ్‌కాట్ పిలుపును ఖండించింది. పరిస్థితి తీవ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది.
బాయ్ కాట్ క్యాంపెయిన్‌ను ఖండిస్తున్నాం
సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న నిర్మాతలు, కార్మికుల జీవితాలపై బాయ్ కాట్ క్యాంపెయిన్ ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ FWICE తాజాగా ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే సినిమా పరిశ్రమతో పాటు ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్న వారు తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉందని తెలిపింది. “‘బాయ్ కాట్ బాలీవుడ్’ ట్రెండ్ నిర్మాతలు, సినిమాల కోసం పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులపై ప్రభావం చూపుతోంది. సాధారణ కార్మికులు, సాంకేతిక నిపుణుల మనుగడకు ముప్పు తెచ్చేలా ఉంది. అంతేకాదు, సినిమాలను ప్రదర్శించే థియేటర్లపై, సినిమాలు చూసేందుకు వచ్చే ప్రేక్షకులపై దాడులు, బెదిరింపులకు పాల్పడ్డాన్ని ఖండిస్తున్నాం” అని వివరించింది.
మొత్తం సినిమా పరిశ్రమనే వ్యతిరేకించడం సరికాదు
“ఏదో ఒక సినిమా కొంత మంది విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందని భావించి, అన్ని సినిమాలను అదే గాటిలో కట్టేయడం మంచిది కాదు. అభిరుచితో విజయం సాధించాలనే కలతో సినిమాలు తీయబడుతున్నాయి. కానీ, ఈ బాయ్ కాట్ కారణంగా ఎంతో మంది కలలు కల్లలు అవుతున్నాయి. కొంత మంది థియేటర్లలోకి దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డంతో పాటు ప్రేక్షకులను భయాందోళనకు గురి చేస్తున్నారు. నిర్మాతలతో పాటు నటీనటులను బెదిరిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. ఈ చర్యలను ఖండిస్తున్నాం” అని ప్రకటించింది.
@fwicemum strongly condemns the ongoing trend of #BoycottBollywood and seek immediate protection against the #hooliganism in #theaters and the #threats to the producers pic.twitter.com/XCBNKEGI3G
— Federation of Western India Cine Employees (@fwicemum) January 6, 2023
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి!
“CBFC చేత ధృవీకరించబడిన ఏ సినిమానైనా బహిష్కరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సినిమాలపై నిరసన విషయంలో ఓ పద్దతిని అవలంభించాలి. అంతేకాని, మొత్తం పరిశ్రమను బహిష్కరించే విధ్వంసక ధోరణితో గుడ్డిగా ముందుకు వెళ్లకూడదు. సినిమాపై తమ ఇబ్బందులను, అభ్యంతరాలను CBFCకి నివేదించాలి. అంతేకానీ, లక్షలాది మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమను చిన్నాభిన్నం చేయకూడదు. నిర్మాతలకు FWICE మద్దతుగా నిలుస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని బాయ్ కాట్ ఉద్యమం నుంచి బాలీవుడ్ ను కాపాడాలని కోరుతున్నాం” అని వెల్లడించింది.
Read Also: ఆటోలో అక్షయ్ భార్య, కూతురు నితారతో షికారు!