ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
‘ఆస్కార్’ వంటి అత్యున్నత అవార్డును దక్కించకోవడమంటే మాటలు కాదు. మరి, మన భారతీయ సినిమాలకు ఆ ఛాన్స్ ఉందా? రూల్స్ ఏమిటీ? RRR, శ్యామ్ సింగర రాయ్ బరిలో ఉన్నాయా?
ఆధునిక సినీ ప్రపంచంలో అత్యున్నత స్థాయి గుర్తింపు ఏదీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు 'ఆస్కార్స్'. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలను గౌరవించేలా ఇచ్చే అకాడమీ అవార్డులనే ఆస్కార్స్ అంటారు. ఈ అవార్డులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏటా మార్చి, ఏప్రిల్, మే ల్లో నిర్వహించే ఈ వేడుకల కోసం ఏడాది ముందు నుంచే సందడి ఉంటుంది. అఫిషియల్ సబ్మిషన్స్, ఎంట్రీలు, షార్ట్ లిస్ట్ లు, ఫైనల్ నామినేషన్లు ఒకటేంటీ అబ్బో... చిట్ట చివరికి 'ది ఆస్కార్స్ గోస్ టూ' అనే మాట వినిపించేంత వరకూ ఒకటే టెన్షన్ హడావిడి. ఇప్పుడు కూడా ఈ ఏడాది అంటే 2022కు గానూ భారత్ నుంచి ఏ సినిమాను ఆస్కార్క్ కి అఫీషియల్ ఎంట్రీగా సబ్మిట్ చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఆస్కార్స్ కు శ్యామ్ సింగరాయ్?
నాని, సాయిపల్లవి జంటగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' మూడు విభాగాల్లో ఆస్కార్స్ కి అఫిషియల్ సబ్మిషన్ గా వెళ్లిందనే వార్త ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్లకు 'శ్యామ్ సింగరాయ్' పోటీపడుతోందని ప్రముఖ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ కి ఉన్న క్రెడిబులిటీ దృష్య్టా భారత్ లో అన్ని ప్రముఖ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఇదే వార్తను ప్రసారం చేశాయి. కానీ నిజంగా ఈ సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిందా అంటే ఏమో ఎవరికీ క్లారిటీ లేదు. ఆఖరికి ఆ చిత్ర బృందం కూడా ఎక్కడా ఈ వార్తపై స్పందించలేదు.
ఆస్కార్స్ సబ్మిషన్ రూల్స్ ఏంటీ..?
2021 లో విడుదలైన సినిమాలకు ఆస్కార్స్ ను 2022 మార్చిలో ప్రకటించారు. అవి 94th Academy Awards. ఇప్పుడు 2022లో విడుదలైన సినిమాలకు ఆస్కార్స్ ను 2023లో ప్రకటిస్తారు. జరగబోయేవి 95th Academy Awards అన్నమాట. 2023లో ప్రకటించే ఆస్కార్స్ కోసం అకాడమీ ఇప్పటికే కటాఫ్ డేట్ ను, అఫిషియల్ సబ్మిషన్ డేట్ ను ముందే ప్రకటించింది. జనవరి 1, 2022 నుంచి 30 నవంబరు 2022 లోపు విడుదలయ్యే సినిమాలు వచ్చే ఏడాది ప్రకటించే ఆస్కార్స్ నామినేషన్స్ లోకి వెళ్తాయి. అఫిషియల్ సబ్మిషన్స్ కోసం డెడ్ లైన్ ను అకాడమీ 3 అక్టోబర్, 2022 గా ప్రకటించింది. అంటే అక్టోబర్, నవంబర్ లో విడుదలయ్యే సినిమాలు కూడా ఎంట్రీకి పంపించుకోవచ్చు. ఫైనల్ నామినేషన్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్ టైంకి అవి స్క్రీనింగ్ అయిపోతాయి కాబట్టి వీటి పైన Film Federation of India ఓ నిర్ణయం తీసుకుని పంపించే అధికారం ఉంటుంది.
అసలు ఆస్కార్స్ లో ఏయే కేటగిరీలు ఉంటాయి..?
ప్రస్తుతానికి 23 కేటగిరీల్లో ఆస్కార్స్ ఇస్తున్నట్లు అకాడమీ అవార్డ్స్ అఫీషియల్ వెబ్ సైట్ Oscars.Org లో ఉంది.
ACTOR IN A LEADING ROLE, ACTOR IN A SUPPORTING ROLE , ACTRESS IN A LEADING ROLE, ACTRESS IN A SUPPORTING ROLE, CINEMATOGRAPHY, COSTUME DESIGN, DIRECTING, FILM EDITING, MAKEUP AND HAIRSTYLING, MUSIC (ORIGINAL SCORE), MUSIC (ORIGINAL SONG), BEST PICTURE, PRODUCTION DESIGN, SOUND, VISUAL EFFECTS, WRITING (ADAPTED SCREENPLAY), WRITING (ORIGINAL SCREENPLAY), SHORT FILM (LIVE ACTION), SHORT FILM (ANIMATED), DOCUMENTARY (SHORT SUBJECT), DOCUMENTARY (FEATURE), ANIMATED FEATURE FILM తో పాటు INTERNATIONAL FEATURE FILM అనే క్యాటగిరీలు ఉంటాయి.
భారతీయ సినిమాలు ఏ క్యాటగిరీలోకి వెళ్తాయి..?
ఇండియాలోనే షూట్ చేసుకుని, ఇండియాలోనే మొదట విడుదలయ్యే ఇండియన్ సినిమాలు INTERNATIONAL FEATURE FILM క్యాటగిరీలో మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది. కారణం అకాడమీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. వాస్తవానికి అకాడమీ అవార్డ్స్ అమెరికన్ సినిమాల కోసం ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా విదేశాల్లో విడుదలయ్యే సినిమాలకు కూడా గౌరవం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా విదేశీ చిత్రాలను నామినేషన్స్ లోకి అంగీకరిస్తున్నాయి. ఒకవేళ నామినేషన్స్ లో వేరే దేశాల చిత్రాలు కనిపిస్తున్నా..అవన్నీ కూడా అకాడమీ రూల్స్ ను పాటిస్తూ మొదట US లోనే విడుదల చేయటం.. ఇంగ్లీషులో సినిమాలో ఉండటం, సినిమాలో పని చేసే ప్రతీ సిబ్బంది పేరు ను స్క్రీన్ క్రెడిట్స్ లో ఉండటం లాంటి 125 రూల్స్ ను ఫాలో కావలసి ఉంటుంది. అవన్నీ చేయలేని దేశాలు తన సినిమాలను సింపుల్ గా INTERNATIONAL FEATURE FILM క్యాటగిరికీ పంపిస్తాయి. మీకు అనుమానం రావచ్చు Slum Dog Millionare కు చాలా విభాగాల్లో ఆస్కార్స్ వచ్చాయి కదా అని. స్లమ్ డాగ్ ఇండియా కథతో, ఇండియాలో షూట్ చేసుకున్న బ్రిటీష్ డ్రామా ఫిల్మ్. పైన చెప్పిన US రూల్స్ అన్నీ ఫాలో అవుతూ తన ఎంట్రీని సబ్మిట్ చేసింది కాబట్టే ఆస్కార్స్ వచ్చాయి.
భారత్ కు ఎప్పుడైనా అవార్డ్ వచ్చిందా..?
1957 నుంచి భారత్ ఆస్కార్స్ కు సినిమాలను అఫీషియల్ గా సబ్మిట్ చేస్తోంది. ఇప్పుడు INTERNATIONAL FEATURE FILM గా పిలుస్తున్న క్యాటగిరీనే ఈ మధ్య కాలం వరకూ Best Foreign Language Film గా పిలిచే వారు. 1956 నుంచి ప్రారంభమైంది ఈ క్యాటగిరీ. ఇంచుమించుగా అప్పటి నుంచి భారత్ ఏటా ఓ సినిమాను అఫీషియల్ ఎంట్రీగా సబ్మిట్ చేస్తూనే ఉంది. 1957 లో 'మదర్ ఇండియా' సినిమా మన మొదటి అఫిషియల్ సబ్మిషన్ కాగా.. ఆ ఏడాది ఆ సినిమా ఫైనల్ నామినేషన్స్ లోకి వెళ్లింది కూడా. ఆ తర్వాత 1988లో ‘సలాం బాంబే’, 2001లో ‘లగాన్’ సినిమాలు నామినేషన్స్ లోకి వెళ్లాయి. కానీ అవార్డు మాత్రం రాలేదు. చివరిగా అంటే గతేడాది 2021 కి గానూ నయనతార, విఘ్నేష్ శివన్ నిర్మించిన 'Pebbles' అనే తమిళ్ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి అఫీషియల్ గా సబ్మిట్ చేశారు. కానీ నామినేషన్స్ లో చోటు దక్కించుకోలేదు. ఇప్పటివరకూ 7సార్లు కమల్ హాసన్ సినిమాలు ఆస్కార్స్ సబ్మిషన్స్ కు అఫీషియల్ గా వెళ్లాయి. అందులో మన తెలుగు సినిమా ‘స్వాతి ముత్యం’ కూడా ఉంది. ఆ తర్వాత 5 ఆమీర్ ఖాన్ సినిమాలు, 3 సత్య జిత్ రే సినిమాలు ఆస్కార్స్ సబ్మిషన్స్ కు వెళ్లాయి. కానీ ఎప్పుడూ ఏ భారతీయ సినిమాకు ఈ క్యాటగిరీలో అవార్డు దక్కలేదు. కనీసం నామినేషన్స్ లోకి ఓ భారతీయ చిత్రం వెళ్లి కూడా 21 ఏళ్లు గడిచిపోయాయి.
సినిమాలకు రాలేదు కానీ మనోళ్లకు వచ్చాయి
1983లో గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన భాను అథయా ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు. ఆ తర్వాత 2009 లో స్లమ్ డాగ్ మిలినీయర్ సినిమాకు గానూ ఏఆర్ రెహమాన్ Best Orginal Song, Best Original Score విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. భారతీయులు రసూల్ పూకుట్టి, గుల్జార్ లు కూడా స్లమ్ డాగ్ సినిమాకు గానూ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. టెక్నికల్ అచీవ్ మెంట్స్ విభాగాల్లో 2016, 2018 లో భారతీయులకు అవార్డులు వచ్చాయి కానీ వాళ్లు ఇండో అమెరికన్స్.
శ్యామ్ సింగరాయ్ వార్త పుకార్లేనా..?
శ్యామ్ సింగరాయ్ ఆస్కార్స్ కు నామినేట్ అయ్యిందని చెబుతున్న విభాగాలు అకాడమీ అవార్డుల జాబితాలో లేవు. ఆస్కార్స్ లో ఏదైనా కొత్త క్యాటగిరీ పెట్టాలన్నా, తీసేయాలన్నా చాలా పెద్ద తతంగం ఉంటుంది. అకాడమీ అవార్డులను నిర్వహించేందుకు ది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పేరుతో ఓ కార్యనిర్వాహక బృందం ఉంటుంది. ఏటా ఓ సారి సమావేశమై సభ్యులు కొత్త క్యాటగిరీలపై చర్చిస్తారు. కొత్త ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే పెడుతుంటారు. వాటిపై ఓటింగ్ జరుగుతుంటుంది.
అలా Best Casting: 1999 లో దీన్ని రిజెక్ట్ చేశారు.
Best Popular Film: ఈ క్యాటగిరీలో ఓ అవార్డ్ ఇద్దామని 2018 లో ప్రపోజల్ వచ్చింది. కానీ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. బహుశా అది వచ్చే ఏడాది అవార్డ్స్ లో యాడ్ కావచ్చు.
Best Stunt Coordination: 1991 to 2012 వరకూ ఏటా ఈ ప్రపోజల్ వచ్చింది. రిజెక్ట్ అవుతూనే ఉంది.
Best Title Design: 1999లో ఈ క్యాటగిరీపై వచ్చిన ప్రపోజల్ రిజెక్ట్ అయ్యింది.
కాబట్టి శ్యామ్ సింగరాయ్ ఆస్కార్స్ కు సబ్మిట్ అయ్యిందని చెబుతున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరీలు నిజం కాకపోవచ్చు. పైగా ‘శ్యామ్ సింగరాయ్’ విడుదలైన తేదీ 24డిసెంబర్ 2021. ఆ తేదీ ఆస్కార్ ఇచ్చిన కటాఫ్ డేట్ లో లేనే లేదు. జనవరి 1, 2022 నుంచి 30 నవంబరు 2022 లోపు విడుదలైన సినిమాలే ఆస్కార్స్ కు వెళ్తాయి. కాబట్టి శ్యామ్ సింగరాయ్ వార్తపై అనుమానాలు ఉన్నాయి. ఆస్కార్స్ కు సబ్మిట్ అయ్యిందనే వార్తల పైన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర బృందం కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ స్పందించలేదు కాబట్టి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?