Sandeep Reddy Vanga: తప్పు నాదే వీలైతే క్షమించు, బాలీవుడ్ బ్యూటీకి ‘యానిమల్’ డైరెక్టర్ క్షమాపణలు
Sandeep Reddy Vanga: ‘యానిమల్’ చిత్రంలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను హీరోయిన్ గా అనుకున్నా, చివరకు రష్మికను తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పరిణీతి చాలా బాధ పడిందని చెప్పారు దర్శకుడు సందీప్ వంగా.
Sandeep Reddy Vanga About Parineeti Chopra: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ ‘A’ రేటింగ్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంలో నటీనటులు, ముఖ్యంగా రణబీర్ కపూర్, బాబీ డియోల్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీళ్ల నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. హీరోయిన్ పాత్రలో నటించిన రష్మిక మందన్న యాక్టింగ్ కూడా అదుర్స్ అనే టాక్ వినిపించింది.
పరిణీతి చోప్రాకు సందీప్ వంగా సారీ
నిజానికి, ఈ చిత్రంలో గీతాంజలి పాత్రకు రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. కానీ, పలు కారణాలతో ఆమె ప్లేస్ ను రష్మిక మందన్నతో రీప్లేస్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కొన్ని పాత్రలు కొందరికి మాత్రమే సెట్ అవుతాయని, పరిణీతిలో గీతాంజలిని చూడలేకపోయానని చెప్పారు ఆయన. ఇదే విషయాన్ని ఆమెకు చెప్తే, చాలా అప్ సెట్ అయిందని వివరించారు. తప్పు తనదే కాబట్టి, వీలైతే క్షమించాలని ఆమెను కోరినట్లు చెప్పారు.
“బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా యాక్టింగ్ నాకు చాలా నచ్చుతుంది. నా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ‘కబీర్ సింగ్’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కు ఆమెనే తీసుకోవాలి అనుకున్నాను. కానీ, కొన్ని కారణాలతో ఆమెను తీసుకోలేకపోయాను. ‘యానిమల్’ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఏడాది ముందే ఈ మూవీ కోసం అగ్రిమెంట్ మీద సంతకం చేసింది. అయితే, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూడాలేకపోయాను. ఇదే విషయాన్ని తనకు చెప్పాను. సినిమా విషయంలో రాజీ పడలేనన్నాను. అందుకే, ఈ సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాను. నేను అలా చెప్పడంతో తను చాలా బాధపడింది. అయినప్పటికీ నా అభిప్రాయాన్ని గౌరవించింది. నా మాటలను అర్థం చేసుకుంది” అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.
‘యానిమల్’పై పలువురు ప్రముఖుల ప్రశంసలు
అటు ‘యానిమల్’ సినిమాపై సినీ విమర్శకులను నుంచి సైతం ప్రశంసలు లభించాయి. టేకింగ్ మరో లెవల్ లో ఉందంటూ ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ సైతం ప్రశంసలు కురిపించారు. కొందరు సినిమాలో వాయిలెన్స్ గురించి విమర్శించినా అవేవి ప్రేక్షకులను అడ్డుకోలేకపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరికొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్కును చేరుకునే అవకాశం కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రంలో అనిల్‌కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ‘యానిమల్ పార్క్’ పేరుతో సీక్వెల్ ను ప్రకటించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్