Samantha Health Condition : సమంతకు అక్కినేని ఫ్యామిలీ నుంచి మద్దతు
అక్కినేని నాగచైతన్య, సమంత వైవాహిక బంధం నుంచి విడిపోయినా... ఆమె అంటే అక్కినేని కుటుంబ సభ్యులకు అభిమానమే. మైయోసిటిస్ వ్యాధి బారిన పడిన ఆమె త్వరగా కోలుకోవాలని మాజీ మరిది, సోదరుడు మెసేజ్ చేశారు.
సమంత (Samantha) ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. అక్టోబర్ 29న తనకు మైయోసిటిస్ ఉందని ఆమె వెల్లడించి, ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఆమె కోలుకోవాలని చాలా మంది సందేశాలు పంపించారు. అందులో చలన చిత్ర ప్రముఖులు కూడా ఉన్నారు. మరి, అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారా? అంటే... 'ఎస్, ఉన్నారు' అని చెప్పాలి.
అక్కినేని నాగచైతన్య, సమంత తమ దారులు వేర్వేరు అని ప్రకటించినా... తమ వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చినా... సమంత అంటే అక్కినేని కుటుంబ సభ్యులకు అభిమానమే. మైయోసిటిస్ వ్యాధి బారిన పడిన ఆమె త్వరగా కోలుకోవాలని మాజీ మరిది అఖిల్ అక్కినేని, సోదరుడు సుశాంత్ సందేశాలు పంపించారు. తద్వారా సమంతపై అభిమానాన్ని చాటుకున్నారు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య వ్యక్తిగతంగా సమంతకు మెసేజ్ లు చేశారని టాక్.
''ప్రియమైన సమంత... నీకు మరింత బలం రావాలి. నీపై అందరూ ప్రేమ చూపించాలి'' అని అఖిల్ అక్కినేని పేర్కొన్నారు. సమంత మైయోసిటిస్ బారిన పడిన విషయం తెలిశాక... నాగ చైతన్య కజిన్స్ కూడా తమ స్పందన తెలిపారు. ''నువ్వు ఈ వ్యాధిని ఎదుర్కొని బలంగా, ధైర్యంగా బయటకు రాగలవ్. నీకు మరింత ఎనర్జీ, స్ట్రెంగ్త్ రావాలని కోరుకుంటున్నాను'' అని సుశాంత్ పేర్కొన్నారు. ''నీలో నువ్వే ఉన్నావ్. నువ్ ఊహించిన దాని కంటే నీకు ఎక్కువ బలం రావాలని కోరుకుంటున్నాను. నీకు నా ప్రేమను పంపిస్తున్నాను'' అని సమంత పోస్ట్ కింద వెంకటేష్ కుమార్తె ఆశ్రిత కామెంట్ చేశారు.
''మీ ప్రేమ, అనుబంధం జీవితం నాకు విసిరే ప్రతి సవాల్‌ను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తోంది. కొన్ని నెలలుగా నేను మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధ పడుతున్నాను. దీన్నుంచి కోలుకున్న తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నా. కానీ, నేను అనుకున్న దాని కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది. నేను ఈ స్థితిని అంగీకరించడానికి కష్టపడుతున్నాను. అయితే... పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్ముతున్నారు'' అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉస్తాద్ రామ్ తదితరులు సమంత త్వరగా కోలుకోవాలని, కోలుకునే ధైర్యం ఆమెకు ఉందని ట్వీట్లు చేశారు. శ్రియ, హన్సిక, కియారా అడ్వాణీ, లక్ష్మీ మంచు, రాశీ ఖన్నా, కృతి సనన్, జాన్వీ కపూర్ లావణ్యా త్రిపాఠి, ప్రగ్యా జైస్వాల్, శాన్వి శ్రీవాత్సవ, నటాషా దోషి, డింపుల్ హయతి, శివాత్మికా రాజశేఖర్, సోనాల్ చౌహన్ తదితరులు కూడా సమంత త్వరగా కోలుకోవాలని, ఆమెకు భగవంతుడు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలని సందేశాలు పంపించారు.
Also Read : బాలకృష్ణకు రష్మిక వీడియో కాల్ - పూజా హెగ్డేతో ముద్దు వద్దే వద్దు
సినిమాలకు వస్తే... సమంత టైటిల్ పాత్రలో నటించిన 'యశోద' నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, దివ్య శ్రీపాద, కల్పికా గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది.